విప్.. గప్ చుప్!
విప్.. గప్ చుప్!
Published Sun, Jul 9 2017 2:41 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
- ప్రభుత్వంపై విపక్షాల దాడిని తిప్పికొట్టని ప్రభుత్వ విప్‌లు
- పద్ధతి మార్చుకోవాలని సీనియర్లకు సీఎం క్లాస్!
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీలు, ప్రజా, సామాజిక సంఘాలు కొన్నాళ్లుగా ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పాలన తీరునూ ఎండగడుతున్నాయి. అయితే తమ ప్రభుత్వంపై, పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నా ప్రభుత్వ విప్‌లు మౌన వ్రతం పాటిస్తున్నారన్న చర్చ అధికార టీఆర్‌ఎస్‌లో సాగుతోంది. ఎవరికివారు తమ సొంత నియోజకవర్గాలకు పరిమితమవుతు న్నారని, ప్రభుత్వ విధానాలను సమర్థించడంలో, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో చురుగ్గా వ్యవహరిం చలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాసనసభలో ఒక చీఫ్‌విప్ సహా నలుగురు విప్‌లు, శాసన మండలిలో ఒక చీఫ్‌విప్ సహా ముగ్గురు విప్‌లు మొత్తం ఏడుగురు ప్రభుత్వ విప్‌లున్నారు. విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నవారిలో మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందు వరసలో ఉండగా, అడపాదడపా బోడకుంటి వెంకటేశ్వర్లు కూడా ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు. శాసనసభ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్‌లు గంప గోవర్దన్, నల్లాల ఓదెలు, గొంగిడి సునీత పూర్తి మౌనంగా ఉంటున్నారు.
విపక్షాల విమర్శల దాడి...
గత కొద్ది నెలలుగా ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు పెరిగా యి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ కోదండరాం, సీపీఎం, సీపీఐ కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, చాడ వెంకటరెడ్డి తదితరులు నిత్యం విమర్శలు చేస్తూనే ఉన్నారు. రైతులకు పంట రుణాలు, మిషన్ భగీరథ వంటి వాటితో పాటు జీఎస్టీకి ముందే అంగీకారం తెలపడం, మియాపూర్ భూకుంభ కోణం, నయీమ్ కేసు వంటి అనేక అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇంత జరుగుతున్నా టీఆర్‌ఎస్ విప్‌ల నుంచి స్పందన కన్పించట్లేదని, వీరికితోడు మంత్రులు సైతం స్పందించడం లేదన్న అభిప్రాయం కూడా ఉంది.
అధినేత అసంతృప్తి...
ఈ క్రమంలో విప్‌లు, కొందరు మంత్రులపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. వీరు పద్ధతి మార్చుకోవాలని కొందరు సీనియర్లకు క్లాస్ కూడా తీసుకున్నారని తెలుస్తోంది. విమర్శలకు సమాధానం ఇచ్చేందుకు ఒకరిద్దరు మండలి విప్‌లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎంపీ బాల్క సుమన్, ఇద్దరు ముగ్గురు మంత్రులు మాత్రమే ముందుకొస్తున్నారంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, నాయిని, తలసాని మాత్రమే విపక్షాల దాడులను తప్పికొడుతున్నారని, మిగిలిన మంత్రులు వారి జిల్లాలకే పరిమితమవుతున్నారని చెబుతున్నారు.
Advertisement
Advertisement