ఎమ్మెల్యేలకే జిల్లా అధ్యక్ష బాధ్యతలు!
• టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం?
• అధికార పార్టీలో జోరుగా చర్చ
• మొదలైన సంస్థాగత ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కానున్నారా..? కొత్త జిల్లాల్లో పార్టీకి ఎమ్మెల్యేలను అధ్యక్షులను చేయడం ద్వారా పార్టీని మరింతగా ప్రజల్లో విస్తరించాలని గులాబీ నాయకత్వం భావిస్తోందా.. ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. ఆ వర్గాల సమాచారం మేరకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ దిశగా ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అసలు కొత్త జిల్లాల ఏర్పాటుతో పార్టీకి కొత్త కమిటీలను నియమించాల్సిన అవసరం ఏర్పడింది.
పాలనకు సంబంధించి ఒక్కో మంత్రికి కనీసం రెండు జిల్లాల బాధ్యతలు అప్పజెప్పాలని ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. పార్టీ విషయానికి వచ్చే సరికి ఒకేసారి కొత్తగా 21 జిల్లాలకు కమిటీలు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. పార్టీ కార్యకలాపాలను మరింతగా విస్తృత పరిచేందుకు వీలైనంత త్వరగా ఆయా జిల్లాలకు అధ్యక్షులను నియమించాలని.. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎమ్మెల్యేలకే ఆ బాధ్యతలను అప్పజెప్పాలన్న నిర్ణయించినట్లు సమాచారం.
ఏడాదిన్నరగా కమిటీలన్నీ ఖాళీ
వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పార్టీ కమిటీలు ఇప్పటికీ భర్తీ కాలేదు. గతేడాది ప్లీనరీ సమయానికే జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడిని రెండేళ్ల పదవీ కాలానికి ఎన్నుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ప్లీనరీ కూడా ముగిసింది. గ్రామ, మండల కమిటీలు భర్తీ అయినా... జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం పూర్తి కాలేదు. చివరకు పొలిట్‌బ్యూరో సైతం భర్తీ కాలేదు. ప్రస్తుతం పార్టీ పదవుల్లో ఉన్న జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షుడి పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌తో ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు ఏర్పాటవడంతో దీపావళి నాటికి కొన్ని జిల్లా కమిటీలను నియమించాలనే నిర్ణయానికి అధినాయకత్వం వచ్చిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా ఏర్పాటైన 125 మండలాలకూ మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు పార్టీ అనుబంధ సంఘాల పదవులన్నీ ఖాళీగానే ఉన్నాయి. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక విభాగాలకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను భర్తీ చేయాల్సి ఉంది.
వాటన్నింటినీ భర్తీ చేయడం ద్వారా పార్టీలోని సీనియర్లందరికీ సంస్థాగత పదవులు దక్కుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే ప్లీనరీ సమయంలో నియమించే కమిటీలే ఆ తర్వాత రెండేళ్ల కాలానికి అంటే 2019 సార్వత్రిక ఎన్నికల వరకు పనిచేయాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ఆరు నెలల కాలానికి తాత్కాలిక కమిటీలను నియమిస్తే నేతల పనితీరుపై ఓ అంచనాకు రావచ్చొన్న అభిప్రాయంలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
నియోజకవర్గాలు తగ్గడంతో..
కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల పరిధిలోని నియోజకవర్గాల సంఖ్య బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం ఒక్కో జిల్లాలో మూడు నుంచి 5 నియోజకవర్గాలే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలే జిల్లా అధ్యక్షులైతే మెరుగ్గా ఉంటుందన్న చర్చ జరిగినట్లు తెలిసింది. ఎమ్మెల్యేల అజమాయిషీతో పార్టీ కేడర్‌ను కూడా బాగా పనిచేయించుకోవచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అయితే ఈ అంశంపై పూర్తిస్థాయిలో పరిశీలన జరిపాకే జిల్లా అధ్యక్షులుగా ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా కూడా జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఎమ్మెల్యేలు లేరు.