ప్రజల ముందుకు గులాబీ దళపతి
రైతు అంశాలే ఎజెండాగా..
- 10న పోచంపాడు బహిరంగ సభతో శ్రీకారం
- ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా జవాబిచ్చే వ్యూహం
- మూడేళ్లలో రైతుల కోసం చేసిన కార్యక్రమాలపై నివేదిక
సాక్షి, హైదరాబాద్: రైతు సమస్యలను ముందు పెడుతూ ప్రభుత్వంపై దాడి చేస్తున్న ప్రతి పక్షాలకు దీటుగా బదులిచ్చేందుకు అధికార టీఆర్‌ఎస్ సమాయత్తమవుతోంది. మూడేళ్లు గా రాష్ట్ర రైతాంగం కోసం తలకెత్తుకున్న కార్యక్రమాలను వివరించడం ద్వారా విమర్శ లకు తెరదించాలని భావిస్తోంది. ఇందుకోసం గులాబీ దళపతి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సిద్ధమవుతున్నారు. ఈ నెల 10న నిజామాబాద్ జిల్లా పోచంపాడులో నిర్వహిం చనున్న రైతు బహిరంగ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వాస్తవాలు వివరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవన పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ. 2 వేల కోట్లు బడ్జెట్ కేటాయించింది. ఈ సందర్భంగానే గత పాలకుల నిర్లక్ష్యాన్ని, ప్రస్తుతం విపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్న తీరునూ ఎండగట్టడంతోపాటు తమ మూడేళ్ల పాలనలో రైతులకు చేసిన మేలు గురించి సీఎం వివరిస్తారని అంటున్నారు.
పక్కగా ప్రణాళిక...
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ సర్కారుపై ప్రతిపక్షాలు రైతు సమస్యలను ముందుపెట్టి టార్గెట్ చేస్తున్నాయి. రుణమాఫీ మొదలు మొన్నటి ఖమ్మంలో మిర్చి రైతులకు బేడీల ఘటన వరకు సర్కారుపై విమర్శల దాడి చేశాయి. రాజకీయ విమర్శలకు ఎప్పటికప్పుడు అధికార పార్టీ ఎదురుదాడి చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి విలేకరుల సమావేశంలో ప్రతిపక్షాల తీరును తూర్పారబట్టారు.
అయితే ఈ విషయంలో రైతులకు వాస్తవాలు వివరించేందుకే పోచంపాడు సభను ఏర్పాటు చేశారంటున్నారు. సభకు రైతుల తరలింపుపై నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల మంత్రులతో ఇప్పటికే చర్చించిన కేసీఆర్...బహిరంగ సభ ఇన్‌చార్జిగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను నియమించారు. ఆయా జిల్లాల రైతాంగాన్ని తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షలు కూడా జరిపారు. ఒక్కో గ్రామం నుంచి కనీసం 500 మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని మంత్రులను ఆదేశించారు.
రైతు కార్యక్రమాల గురించి వివరణ...
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి రాగానే రూ. 17 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, వచ్చే ఏడాది నుంచి ఏటా ఎకరాకు రూ. 8 వేలు సాగు ఖర్చుల కోసం రైతుల అకౌంట్లలో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. రైతులకు 9 గంటల విద్యుత్, కొన్ని జిల్లాల్లో 24 గంటల సరఫరా, ఇబ్బంది లేకుండా విత్తనాలు, ఎరువుల సరఫరా వంటి ప్రభుత్వ విజయాలను వివరించనున్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి నియామకం, రూ. 1,024 కోట్లతో 18 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంగల గోదాముల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా పెరిగిన సాగు విస్తీర్ణం తద్వారా పెరిగిన ధాన్యం దిగుబడి వంటి విషయాలనూ రైతులకు సీఎం వివరించనున్నారు.
ప్రతిపక్షాలపై ఎదురుదాడి...
రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీ డిజైన్‌పై ప్రతిపక్షాల విమర్శలను ఈ సభ ద్వారా సీఎం గట్టిగా తిప్పికొట్టనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. నీటిపా రుదల ప్రాజెక్టులపై మొత్తం 164 కేసులు వేయగా, అందులో ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఏకంగా 119 కేసులు వేశారని, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, మల్లన్నసాగర్, సుందిళ్ల బ్యారేజ్ తదితర ప్రాజెక్టులపై వేసిన కేసుల గురించి కూడా సీఎం వివరించనున్నారని పేర్కొంటున్నారు. మొత్తం మీద రానున్న ఎన్నికల నేపథ్యంలో ఒకింత ముందుగానే సీఎం ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారని, పోచం పాడుతో శ్రీకారం చుడుతున్నారని అధికార పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.