
దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు : సీఎం కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణలో అక్టోబర్ 11 (విజయదశమి) నుంచి కొత్త జిల్లాలు ఏర్పాడతాయని సీఎం కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్లో మంగళవారం ఆయన ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కేసీఆర్ చెప్పారు. జిల్లాల ఏర్పాటుపై అన్ని వర్గాల నుంచి వచ్చే ప్రతిపాదనలు చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం మహముద్ అలీ అధ్యక్షతన మంత్రులు కడియం శ్రీహరి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు జారీ చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ముందు కేబినేట్, అఖిలపక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. డ్రాఫ్ట్ విడుదలైన తర్వాత అభ్యంతరాలు, సూచనలకు నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు కేసీఆర్ చెప్పారు.