
ఏదీ ప్రక్షాళన
► ముంచుకొస్తున్న వర్షాకాలం
► పూడుకుపోయిన డ్రైనేజీలు
► చినుకుపడితే రహదారులు గోదారే పట్టించుకోని అధికారులు
సాక్షి,సిటీబ్యూరో: వర్షాకాలం సమీపిస్తున్నా అధికార యంత్రాంగం కళ్లు తెరవడంలేదు. ఇటీవల నగరంలో కురిసిన కొద్దిపాటి వర్షాలకే రహదారులు గోదారులను తలపించాయి. డ్రైనేజీలు ఉప్పొంగగా, మూతలు లేని మ్యాన్‌హోళ్ల వద్ద వరదనీరు సుడులు తిరిగింది. గ్రేటర్‌లో మురుగు నీటిపారుదల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటమే ఆందుకు కారణం. అయినా అధికారులు నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి విభాగాల మధ్య సమన్వయ లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు ఉన్నాయి.
నిలువెల్లా నిర్లక్ష్యం..!
వేసవి పూడికతీత పనులు చేపట్టేందుకు కాగితాలపై ప్రణాళికలు సిద్ధంచేసిన జలమండలి అధికారులు ఆచరణలో విఫలమయ్యారు. గ్రేటర్ పరిధిలో 5000 కిలోమీటర్ల మేర మురుగునీటి పారుదల వ్యవస్థకు చెందిన పైపు లైన్లున్నాయి. ఇందులో 1500 కిలోమీటర్ల మేర పైప్‌లైన్లలో పూడిక పేరుకుపోయింది. వీటిని యుద్ధ ప్రాతిపదికన ఎయిర్‌టెక్ యంత్రాలతో శుద్ధిచేస్తేనే వర్షాకాలంలో నీటి ప్రవాహానికి ఆటంకం ఉండదు. అయితే జలమండలి దీనిపై దృష్టి సారించకపోవడంతో నిత్యం డ్రైనేజీ లైన్లు పొంగి పొర్లుతున్నాయి. జలమండలి మెట్రో కస్టమర్ కేర్ సెంటర్‌కు రోజూ 200కు పైగా ఫిర్యాదులు అందుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
గ్రేటర్ పరిధిలో సుమారు 1500 కిలోమీటర్ల మేర ఒపెన్ నాలాలు, డ్రైనేజిలున్నాయి. వీటి పర్యవేక్షణ బాధ్యతను జీహెచ్‌ఎంసీ చూస్తోంది. వీటిలో ఇప్పటివరకు సగం మేర మాత్రమే పూడిక తీశారు. మిగతా చోట్ల చెత్తా చెదారం పేరుకుపోవడంతో వరదనీటి ప్రవాహానికి తరచూ ఆటంకాలు ఏర్పడుతుండడంతో సమీప బస్తీలు, కాలనీలు జలమయమవుతున్నాయి. పలు నాలాలకు ఫెన్సింగ్ లేదు. నాలుగేళ్ల క్రితం పెద్ద నాలాలకు అరకొర రక్షణ ఏర్పాట్లు చేసి మహానగరపాలక సంస్థ చేతులు దులుపుకోవడం గమనార్హం.
ఎక్కడి చెత్త అక్కడే..
ఏటా వేసవిలో డ్రైనేజి పైపు లైన్లలో పూడికతీత తొలగించడం ఆనవాయితీ. ఈసారి పనులు పూర్తిచేయడంలో జలమండలి అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ముంపు భయంతో స్థానికులు అందోళన చెందుతున్నారు. దీనిపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు జలమండలి క్షేత్రస్థాయి అధికారులు,అత్యవసర కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు కరువయ్యారు.
మత్యు బిలాలదీ అదే పరిస్థితి.....
గ్రేటర్‌లో అడుగడుగునా నోళ్లు తెరచుకున్న మ్యాన్‌హోళ్లకు మూతలు లేక పోవడం నగర దుస్థితికి అద్ధంపడుతుంది. పగిలిపోయి శిథిలా వస్థలో ఉన్న మత్యుబిళాలపై మూతలు ఏర్పాటుచేయడంలో ఇటు జలమండలి, అటు జీహెచ్‌ఎంసీలు విఫలమౌతున్నాయి. నగరంలో 1.50 లక్షల మ్యాన్‌హోళ్లుండగా ఇందులో 25 వేల వరకు మూతలు లేకపోవడం గమనార్హం.
కిర్లోస్కర్ కమిటీ సిఫారసులు బుట్టదాఖలు..
నగరంలో డ్రైనేజీ వ్యవస్థ, వరదనీటి కాల్వల ఆధునికీకరణకు కి ర్లోస్కర్ ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఏడేళ్ల క్రితం విలువైన సిఫారసులు చేసింది. వీటిని గ్రేటర్ పరిధిలో అమలు చేయాలంటే రూ.6 వేల కోట్లు అవసరమవుతాయని జీహెచ్‌ఎంసీ అధికారులు పేర్కొంటున్నా.. నిధులను కేటాయించడంలో నగరపాలక సంస్థ చేతులెత్తేయడంతో పరిస్థితి నానాటికి ప్రమాదకరంగా మారుతోంది.