సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.సంపత్‌కుమార్‌ల వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కాంగ్రెస్ గవర్నర్‌ను కోరనుంది. వారి శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలంటూ కోర్టు తీర్పునిచ్చి 20 రోజులవుతున్నా కనీసం ప్రభుత్వం స్పందించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కార్యనిర్వహక అధికారులను ఉపయోగించి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయనుంది.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్ నరసింహన్‌ను కలవనుంది. ఇద్దరు ఎమ్మెల్యేల బహిష్కరణ అంశంతోపాటు పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు సమాచారం. హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అటు ప్రభుత్వం, ఇటు అసెంబ్లీ పక్షాన కానీ మళ్లీ కోర్టులో అప్పీల్ చేయలేదని, అలాంటప్పుడు తీర్పును ఆమోదించినట్టే అవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని పీసీసీ ముఖ్య నేత ఒకరు వెల్లడించారు.
అలాగే తమ పార్టీ ఇద్దరు శాసనసభ్యుల పేర్లను అసెంబ్లీ వెబ్‌సైట్‌లో ఎమ్మెల్యేలుగా చూపించడం లేదని, సీఎస్, డీజీపీ అధిపతులుగా ఉన్న శాఖల్లో ఆ ఇద్దరికీ కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో తమ అధికారాలను ఉపయోగించి వెంటనే హైకోర్టు తీర్పును అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment