
నెలాఖరులోగా పూర్తిచేయండి
ఇంజనీరింగ్ అఫిలియేషన్లపై జేఎన్టీయూహెచ్ అధికారులతో డిప్యూటీ సీఎం కడియం సమీక్ష
హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జేఎన్టీయూహెచ్ ఉన్నతాధికారులను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. అఫిలియేషన్ల ప్రక్రియ తాజా స్థితిగతులపై శనివారం ఆయన సమీక్షించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ప్రమాణాలను పాటించిన కాలేజీలకు అఫిలియేషన్లను ఇవ్వడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తేవాల్సిన అవసరాన్ని మరవద్దని సూచించారు.
అఫిలియేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చిందని, నాలుగైదు రోజుల్లో కళాశాలల జాబితాను ప్రభుత్వానికి సమర్పిస్తామని జేఎన్టీయూహెచ్ వీసీ శైలజా రామయ్యార్, రిజిస్ట్రార్ యాదయ్య ఉపముఖ్యమంత్రికి తెలిపారు. జూలై నెలాఖరులోగా కౌన్సెలింగ్ పూర్తిచేసి, ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ స్పెషల్ సీఎస్ రాజీవ్ రంజన్ ఆచార్యను డిప్యూటీ సీఎం ఆదేశించారు.