
మోదీ సారథ్యంలో సమగ్ర ప్రగతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
అఫ్జల్‌గంజ్: ప్రపంచ దేశాలన్నీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వైపే చూస్తున్నాయని, దేశ సమగ్ర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం గౌలిగూడ మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ‘నవీన పథంలో ప్రగతి’ ఛాయా చిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ఇలాంటి ప్రదర్శనలను ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14 నుంచి ‘ఇ-మండి’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని వివరించారు.
రైతుల కోసం ప్రధానమంత్రి పసల్ బీమా యోజనను తీసుకువచ్చారని తెలిపారు. వ్యవసాయ రంగానికి కోతలు లేని విద్యుత్‌ను అందించేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించిందన్నారు. కేంద్రం చర్యలతో నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు దూరమయ్యాయని వివరించారు. అంబేద్కర్ జన్మించిన గ్రామాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారని తెలిపారు. అంబేద్కర్‌కు సంబంధించిన ఐదు కీలక స్మారక ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం పంచతీర్థాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కిషన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలను కలుపుతూ రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సమాచార కార్యాలయం డెరైక్టర్, క్షేత్ర ప్రచార అధికారిణి కృష్ణవందన, అసిస్టెంట్ మాంకాళి శ్రీనివాస్, ఎంజీబీఎస్ స్టాల్ అసోసియేషన్ అధ్యక్షులు జి. నరేందర్ యాదవ్, బీజేపీ మజ్దూర్ మోర్చా కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ వై.కృష్ణ, హాకర్స్ సెల్ కన్వీనర్ మహేష్ కుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.