
కొత్త బంగారులోకం
జాగ్రత్తలు అవశ్యం
మంచి స్నేహమే ఉత్తమ మార్గం
సానుకూల దృక్పథం అవసరం
ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకాలజిస్టుల సలహా
ఇంటర్ పూర్తవగానే భవిష్యత్తుపై కొత్త ఆశలు ఇంజినీరింగ్ వైపు నడిపిస్తాయి. ఇంజినీరింగ్ అంటేనే కొత్త ప్రపంచం. ఎంసెట్ కౌన్సెలింగ్ అనంతరం విద్యార్థులు ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్‌లో అడుగుపెట్టారు.. మునుపెన్నడూ లేని చదువులు.. కొత్త వాతావరణం.. విభిన్న మనస్తత్వాల మధ్య కొత్త స్నేహాలు. అందరితో కలిసి నాలుగేళ్లు సాగాలి. ప్రతి అంశం పట్లా జాగ్రత్తగా మెలిగితే బంగారు భవిష్యత్తు సొంతమవుతుంది. దూకుడు మీదున్న వయసు ఎన్నో రకాలుగా ప్రేరేపిస్తుంది. ఫలితంగా దురలవాట్లు. ర్యాగింగ్, మానసిక ఒత్తిడి.. ఇలాంటి వాటికి లొంగకుండా నడుచుకోవాలి. వీటిపై తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు కన్నేసి ఉంచాలి. వీటన్నింటిపైనా అవగాహన కల్పించడం కోసం ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
- సాక్షి, సిటీబ్యూరో
నైపుణ్యాలే అదనపు అర్హతలు..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువొక్కటే సరిపోదు. నైపుణ్యాలు, కమ్యూనికేషన్, పాఠ్యాంశాలపై విషయ పరిజ్ఞానం, విశ్లేషణ సామర్థ్యం తప్పనిసరి. ఈ నాలుగేళ్లలో సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. మనం ఏ విషయంలో ఇంకా మెరుగు పడాలో గుర్తించి దానికి అధిక సమయం కేటాయించాలి. దేశవ్యాప్తంగా ఏటా ఏడు లక్షల మందికిపైగా విద్యార్థులు ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంటున్నారు. ఇందులో కేవలం 15 శాతం మందినే ఉద్యోగాలు వరిస్తున్నాయి. 85 శాతం మార్కులు సాధించినా నైపుణ్యాలు లేక ఉద్యోగం దక్కడం గగనమై పోయింది. నిరంతరం సాధన చేస్తేనే ఈ అవరోధాన్ని దాటడం కష్టం కాదని విద్యార్థులు గుర్తించాలి. భాష, వ్యాకరణ దోషాలు కూడా ప్రధాన అడ్డంకిగా మారాయి. ఈ నాలుగే ళ్లలో వీటిని సవరించుకుంటే విజయానికి దగ్గరైనట్లే. సానుకూల దృక్పథం అలవర్చుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి.
కఠిన శిక్షలు తప్పవు..
విద్యార్థులు తమ భవిష్యత్‌ను చేజేతులా నాశనం చేసుకోవద్దు. ర్యాగింగ్‌కు పాల్పడ్డ చాలామందికి శిక్ష లు పడ్డాయి. ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి. ర్యాగింగ్ చేసినట్లు గుర్తిస్తే.. తీవ్రతను బట్టి శిక్ష ఉంటుంది. తరగతుల నుంచి బహిష్కరించడం, కళాశాలలో అడ్మిషన్ రద్దు చేయడం, పరీక్షలకు అనుమతించక పోవడం, ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టడం తదితర శిక్షలు ఉంటాయి. ర్యాగింగ్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళాశాలల యాజమాన్యాలపై కూడా చర్యలు తప్పవు. అనుబంధ గుర్తింపు రద్దు వంటి తీవ్ర చర్యలు ఉంటాయి. - స్వాతిలక్రా,
అదనపు పోలీస్ కమిషనర్ (సిట్ అండ్ క్రైమ్)
ఇలా చేస్తే మేలు..
క్రమం తప్పకుండా తరగతులకు హాజరు కావాలి. సబ్జెక్ట్ అర్థం కాకున్నా వినడం ద్వారా కొంతైనా అవగతమవుతుంది. బుర్రకెక్కని విషయాలను అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలి. అంతేగాక తోటివారితో చర్చిస్తే కూడా తొందరగా అర్థమవుతుంది. అంత సులువుగా మర్చిపోరు.
స్నేహం మంచిదే కానీ..
సీనియర్స్‌తో ఫ్రెండ్లీగా ఉంటూ తోటివారితో చనువుగా మెలగాలి. ఆనందంతో పాటు బాధలను పంచుకునే స్నేహానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. చేసే ఏ పనికైనా మంచి.. చెడుని విశ్లేషించి అడుగేయాలి. ఇంజినీరింగ్‌లోనే అధిక మంది విద్యార్థులు దురలవాట్ల బారిన పడుతున్నారని సర్వే చెబుతోంది. మొబైల్, చాటింగ్, వాట్సప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ వెబ్‌సైట్లకు వీలైనంత తక్కువ సమయం కేటాయించాలి. మొదటి నుంచే వీటి వాడకాన్ని నియంత్రించుకోవడం ఉత్తమం.
మానసిక నిపుణుల మాట..
ఓపెన్ మైండెడ్‌గా ఉండాలి. కళాశాల పరిస్థితులు, తోటివారి న డవడిక, సీనియర్ల కదలికలపై దృష్టి సారించాలి. ఒంటరితనం వద్దు. నలుగురి మధ్య అధికంగా ఉండడానికి ప్రయత్నించండి. ఖాళీ సమయాన్ని లైబ్రరీకి కేటాయించాలి. పుకార్లను నమ్మొద్దు. చూసి, విన్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. సీనియర్లు అందరూ చెడ్డవారు కాదన్న భావనతో ఉండాలి. అయితే, ఎవరు మంచో.. చెడో నిశితంగా పరిశీలించాలి. చెడు స్నేహాన్ని దూరంగా పెట్టండి. అప్పుడప్పుడు ఆటలూ ఉండాలి.
తల్లిదండ్రులకు సలహాలివి..
కళాశాల నుంచి రాగానే పిల్లలతో కచ్చితంగా మాడ్లాడాలి. ఆ రోజు విషయాలు ఏంటో తెలుసుకోవాలి. ఒత్తిడి ఫీలైతే అందుకు గల కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. అవసరమైతే సలహాలివ్వాలి.
వారి అభిరుచులకు పిల్లలు కొంత సమయం వెచ్చించేలా వీలు కల్పించాలి. ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం పొందుతారు.
ప్రవర్తన, నడవడిక, మాట తీరును ఎప్పటికప్పుడు గమనించాలి. తేడా గమనిస్తే దగ్గరకు తీసుకుని వివరాలు అడగండి.
తల్లిదండ్రులతో మొదలవ్వాలి..
యువతకు అతివేగం మీదున్న మోజు వారి ప్రాణాలను మింగేస్తుందన్న వాస్తవాన్ని విద్యార్థులు గుర్తించడం లేదు. ఈ క్రమంలో ఎదుటివారూ ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, రాష్ రైడ్ వల్ల కలిగే నష్టాలపై మొదట తల్లిదండ్రులు తమ పిల్లలకు వివరించాలి. ఇంటి నుంచి ఎలా వెళ్తున్నారో.. తిరిగి సురక్షితంగా ఎలా రావాలో మార్గనిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. మా బాధ్యతగా విద్యార్థులు రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో యాజమన్యాలు భాగమవ్వాలి.
- దివ్య చరణ్‌రావు, అదనపు డీసీపీ (ట్రాఫిక్ -2), సైబరాబాద్
కౌన్సిలింగ్ తప్పనిసరి..
కళాశాల వాతావరణానికి విద్యార్థులు అలవాటు పడేందుకు కనీసం ఆరు వారాల సమయం పడుతుంది. ఈ సమయంలో చదువు కంటే.. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ర్యాగింగ్ చేస్తారన్న భయంతో చాలా మంది విద్యార్థులు కాలేజీల్లో అడుగు పెడుతున్నారు. ఇతర విద్యార్థుల నుంచి సంజ్ఞలు, చూపులు ఎదురైనా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటివారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రతి 100 మంది విద్యార్థుల్లో 15 నుంచి 20 శాతం సున్నిత మనస్తత్వ వ్యక్తులు ఉంటారు. ర్యాగింగ్‌పై ఫిర్యాదులను యాజమాన్యాలు నేరుగానే కాకుండా మెయిల్, బాక్స్ పద్ధతి ద్వారా అందేలా చూడాలి. విషయాన్ని నమ్మకమైన స్నేహితులకు, తల్లిదండ్రులకు చెప్పాలి.
- డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, సైక్రియాటిస్ట్ (మెడిసిటీ)