‘మెడికల్’ ప్రవేశాలపై గందరగోళం | Confusion Over medical exam In Telugu Students | Sakshi
Sakshi News home page

‘మెడికల్’ ప్రవేశాలపై గందరగోళం

Published Fri, Apr 29 2016 3:11 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

‘మెడికల్’ ప్రవేశాలపై గందరగోళం - Sakshi

‘మెడికల్’ ప్రవేశాలపై గందరగోళం

ఇప్పటికే ఎంసెట్ నోటిఫికేషన్ జారీ నేపథ్యంలో సందిగ్ధం
ఎంసెట్ కచ్చితంగా నిర్వహిస్తామన్న విద్యా మండలి
అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి


సాక్షి, హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ‘నేషనల్ ఎలిజిబిలిటీ, ఎంట్రెన్స్ టెస్టు (నీట్)’ ద్వారా చేపట్టాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర విద్య, వైద్య శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ‘నీట్’ నుంచి ఈ ఏడాది ఎలా బయటపడాలన్న దానిపై దృష్టి సారించాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎంసెట్, ప్రైవేటు మెడ్‌సెట్ నోటిఫికేషన్లు జారీ చేయడం, మేలో ఎంసెట్ పరీక్ష నేపథ్యంలో సుప్రీం ఇచ్చిన తీర్పుతో అధికారుల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులు ‘నీట్’ పరీక్షకు హాజరుకావాలా, లేదా అన్న సందిగ్ధంలో మునిగిపోయారు.
 
ఎంసెట్ నిర్వహిస్తాం: పాపిరెడ్డి
దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష  ఉంటే మంచిదే అయినప్పటికీ..కోర్టు తీర్పు కాపీ అందకముందే ‘నీట్’పై తామేమీ వ్యాఖ్యానించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎంసెట్‌ను నిర్వహిస్తామని.. విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు.
 
అవసరమైతే రివ్యూకు వెళతాం: లక్ష్మారెడ్డి
‘నీట్’పై కోర్టు తీర్పు కాపీ అందాక తదుపరి చర్యలు చేపడతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. నీట్ ద్వారానే  మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాలన్నది మంచిదేనని వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు చేపడతామని... అవసరమైతే రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోందని, వారితోనూ చర్చించి ముందుకు సాగుతామని చెప్పారు.
 
తెలుగు మీడియంకు కష్టమే

ఎంసెట్‌లో ప్రశ్నపత్రం ఇంగ్లిషుతో పాటు తెలుగులోనూ ఉంటుంది. తెలుగు మీడియం  విద్యార్థులకు అది ప్రయోజనకరం. ఏటా ఇంటర్ పూర్తి చేసే  విద్యార్థుల్లో బైపీసీ విద్యార్థులు లక్ష మంది వరకు ఉంటున్నారు. అందులో 50 శాతానికిపైగా తెలుగు మీడియంలో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులే. ‘నీట్’ ఇంగ్లిషులోనే ఉండే అవకాశమున్న నేపథ్యంలో వారికి ఇబ్బందులు తప్పవు. ‘నీట్’ను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) సిలబస్ ప్రకారం నిర్వహిస్తారు. ఈ సిలబస్‌కు ఇంటర్‌లో చదువుకునే రాష్ట్ర సిలబస్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది.
 
రెండింటికీ సిద్ధం కావాల్సిందే!
ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా విద్యార్థులు ఎంసెట్‌తోపాటు నీట్‌కు కూడా సిద్ధం కావాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఈసారికి తెలంగాణలో నీట్ వద్దని... వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామంటూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పిటిషన్ వేసినా దానిపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇప్పుడే తెలియదు. విచారణకు స్వీకరించినా తుది తీర్పు ఇచ్చేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో నీట్‌కు సిద్ధమైతేనే మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
 
371(డి) విషయంలో రావాల్సిన స్పష్టత!

తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు రాజ్యాంగపరంగా ప్రత్యేక పరిస్థితులు, ప్రత్యేక చట్రంలో ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వులు, ఆర్టికల్ 371 (డి) ప్రకారం స్పష్టమైన విధానాలున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ జోన్లుగా విభజించి 371(డి)లో చేర్చారు. ఒక్కో జోన్‌లో ఆ జోన్ పరిధిలోని విద్యార్థులకు 85 శాతం సీట్లు, మిగతా 15 శాతం సీట్లు ఓపెన్ కోటాలో మూడు జోన్లకు చెందిన విద్యార్థులకే చెందుతాయి. ఇతర రాష్ట్రాలవారు ఇక్కడికి రావడానికి వీల్లేదు. రాష్ట్ర విభజన చట్టం కూడా పదేళ్ల పాటు పాత ప్రవేశాల విధానమే అమలు చేయాలని స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు జాతీయ స్థాయి పోటీ పరీక్ష అయిన నీట్ పరిధిలోకి ఎలా వెళ్లాలి, వెళితే తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ సీట్ల భర్తీ పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement