
టిక్కెట్ టెన్షన్‌తో ఓ నేతకు గుండెపోటు
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నామినేషన్లకు గడువు దగ్గర పడుతుండడంతో అన్ని రాజకీయ పార్టీల నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రధాన పార్టీల ఆశావాహులు టెన్షన్తో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా టిక్కెట్ టెన్షన్‌తో ఓ కాంగ్రెస్ నేత గుండె పోటుకు గురై ఆస్పత్రి పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్లితే....బాగ్‌అంబర్‌పేట డివిజన్‌లో నివసించే శ్రీరాములు ముదిరాజ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు. గత కార్పొరేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించి విఫలమయ్యాడు. తిరిగి ఈ దఫా కూడా టిక్కెట్ కోసం మూడు రోజుల క్రితం వి.హనుమంతరావుకు దరఖాస్తు సమర్పించాడు. శ్రీరాములుకు టిక్కెట్ విషయంపై హామీ రాకపోవడంతో బుధవారం ఉదయం పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడితో మాట్లాడారు.
అనంతరం బయటకు వచ్చేసమయంలో ఒక్కసారి గుండెలో నొప్పి వచ్చి కుప్ప కూలిపోయాడు. గమనించిన నాయకులు ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంటనే అతనికి అత్యవసర విభాగంలో చికిత్స అందించడంతో కొద్ది సేపటి తరువాత కోలుకున్నాడు. సమాచారం అందుకున్న వి.హెచ్ ఆస్పత్రికి వెళ్లి ఆయనను పరామర్శించి ఒత్తిడికి గురికావద్దని చెప్పాడు. ఇంత జరిగింది కానీ, టిక్కెట్పై భరోసా మాత్రం లభించలేదు. అన్ని పార్టీల అభ్యర్థుల్లో మరో రెండు రోజుల పాటు టెన్షన్ కొనసాగే అవకాశముంది.