'రాష్ట్ర ప్రయోజనాలను సీఎం తాకట్టు పెట్టారు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ప్రతిపక్షాలను నిందించినంత మాత్రాన వాస్తవాలు కనుమరుగు కావన్నారు.
తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాష్ట్రానికి ప్రయోజనం ఉండేదన్నారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుతో 90 రోజులపాటు 160 టీఎంసీల నీటి వినియోగానికి ప్రతిపాదన, మహారాష్ట్ర ప్రభుత్వంతో సూత్రప్రాయ ఒప్పందం కూడా జరిగిందని చెప్పారు. తెలంగాణ ప్రయోజనాల కోసం 152 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసే ధైర్యం సీఎం కేసీఆర్‌కు లేదన్నారు.
18 లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారో, మరో 18లక్షల ఎకరాలను ఎలా స్థిరీకరిస్తారో చెప్పాలని జీవన్ రెడ్డి సవాల్ చేశారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ అనాలోచిత నిర్ణయమని జీవన్రెడ్డి మండిపడ్డారు. వాస్తవాలను సీఎం వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. అధికారం శాశ్వతం కాదని, ప్రజల పక్షాన నిజాయితీగా ఆలోచించాలని.. అధికారంలో ఉన్నవారు ముందుచూపుతో వ్యవహరించాలని జీవన్ రెడ్డి సూచించారు.