
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నారాయణరావు
* ఎస్‌బీ కానిస్టేబుల్ నారాయణరావు ఆత్మహత్యాయత్నం
* గతంలో సీఎం కేసీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్న నారాయణరావు
* ఉన్నతాధికారి వేధింపులే కారణమంటున్న కుటుంబసభ్యులు
సాక్షి, హైదరాబాద్ : ‘శభాష్ పోలీసన్నా’ అని సీఎం కేసీఆర్‌తో ప్రశంసలు అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.నారాయణరావు శనివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గతంలో పాస్‌పోర్టు దరఖాస్తుదారుడు ఇవ్వజూపిన డబ్బును తిరస్కరించిన నారాయణరావుకు...
అప్పటినుంచి వెస్ట్‌జోన్ ఎస్‌బీ విభాగం అధికారి వేధింపులు ఎక్కువ కావడంతో ఈ చర్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నారాయణరావు, సీఎం కేసీఆర్‌ను కలసినప్పటి నుంచి ఆ అధికారి అసభ్య పదజాలం ఉపయోగించడంతో పాటు మామూళ్లు తేవాలని ఒత్తిడి చేస్తుండేవారని, అందువల్లే నారాయణరావు నిద్రమాత్రలు మింగారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
వేధింపులు భరించలేకే..: నారాయణరావు నిజాయితీపరుడైన అధికారని.. చాలా సౌమ్యుడని.. అలాంటి వ్యక్తిని వెస్ట్‌జోన్ ఎస్‌బీ విభాగం అధికారి దూషించడం.. ఆయనను మనస్తాపానికి గురిచేసిందని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. లంచాలు తీసుకోవద్దని నారాయణరావు చెబితే, మామూళ్లు తేవాల్సిందేనని ఆ అధికారి వేధించేవాడని. శనివారం కూడా వీరిమధ్య వాదులాట జరిగిందని సమాచారం.
దీంతో నారాయణరావు శనివారం సాయంత్రం జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో జనాలు లేని ప్రాంతానికి వెళ్లి వెంట తెచ్చుకున్న 20 నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారని తెలుస్తోంది. స్థానికులిచ్చిన సమాచారంతో పోలీసులు నారాయణరావుని అమీర్‌పేటలోని ప్రైమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ సాగిస్తున్నారు.