ఉద్యోగులకు వైద్య మా ..రాం రాం
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి కార్పొరేట్ వెనకడుగు
ప్రధాన ఆస్పత్రులు ఇప్పటికీ ఎన్‌రోల్ చేసుకోలేదు
ఓపీ సేవలకు ప్రత్యేక చెల్లింపులు చేయాలని డిమాండ్
కార్డులున్నా ఉద్యోగులకు వైద్య సేవలు అందని పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు అందాల్సిన నగదు రహిత వైద్య సేవలకు ఆదిలోనే హంసపాదు పడినట్లైంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోవడం, ప్రభుత్వ నిర్ణయాలను ప్రైవేటు ఆస్పత్రులు వ్యతిరేకించడం వెరసి తాత్కాలిక హెల్త్ కార్డులు తీసుకున్న ఉద్యోగులకు కూడా వైద్య సేవలు అందని పరిస్థితి. దీంతో లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు వైద్య పథకానికి దూరంగా ఉన్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ రేట్లకు, కార్పొరేట్ ఆస్పత్రులు అడుగుతున్న దానికీ తీవ్రంగా వ్యత్యాసముండటమే.
రాష్ట్రవ్యాప్తంగా 450 ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల పరిధిలో ఉంటే అందులో 300 ఆస్పత్రులు ప్రైవేటువే. ఇందులో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ తదితర నగరాల్లో ఉన్న కార్పొరేట్ ఆస్పత్రులు ఇప్పటికీ నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితాలో పేరు నమోదు చేసుకోలేదు.
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులుగా ఉన్న చాలా ఆస్పత్రులు ఉద్యోగుల ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తాము నష్టానికి పనిచేయలేమని, ప్యాకేజీ రేట్లు సవరిస్తేనే పథకంలోకి వస్తామని ఆ ఆస్పత్రుల వారు చెబుతున్నారు. పైగా ఓపీ సేవలకు ప్రత్యేకంగా చెల్లించాలని పట్టుబడుతున్నారు. ఇన్‌పేషెంట్‌కు మాత్రమే తాము అంగీకరిస్తామని అంటున్నారు.
ఆరోగ్యశ్రీ పరిధిలోని రోగులకు గానీ, ఉద్యోగుల పథకంలో ఉన్న వారికి గానీ క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసేది కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే. అలాంటి ఆస్పత్రులే పథకంలో లేకపోవడం ఉద్యోగులను వేధిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో డబ్బు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు.
కార్డులు జారీ చేసినా ఫలితం లేదు..
ఉద్యోగుల వైద్యసేవలకు గానూ ఇప్పటి వరకూ సుమారు 12 లక్షల తాత్కాలిక హెల్త్‌కార్డులు జారీ చేసినట్లు ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ చెబుతోంది. కానీ ఈ కార్డులను ఉద్యోగ శ్రీ పరిధిలో ఉన్న ఆస్పత్రులే అంగీకరించడం లేదు. కొన్ని ఆస్పత్రులు డబ్బు కట్టించుకుని, పూర్వ పద్ధతిలోనే రీయింబర్స్ చేసుకోండని చెబుతున్నాయి. మరికొన్ని ఆస్పత్రులు ఈ కార్డులు చెల్లవని చెబుతున్నాయి.
{పభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవని, అలాంటి ఆదేశాలు వచ్చినప్పుడు వైద్యం చేస్తామని చెబుతున్నాయి. కార్డు పనికిరాదని ఆస్పత్రులు చెబుతున్నాయి, రీయింబర్స్ ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య సేవలు అందక సతమతమవుతున్నారు.
ఇక నిర్దేశించిన 347 జబ్బులకు ప్రభుత్వాసుపత్రులకు వెళితే.. అక్కడి వసతులు చూసి బెంబేలెత్తుతున్నారు. జీవో జారీ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఉద్యోగులు మండిపడుతున్నారు.