మరో భూపోరాటానికి సీపీఐ సన్నద్ధం
మిలిటెంట్ తరహాలో ఉద్యమిస్తామంటున్న నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో భూపోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సన్నద్ధమవుతోంది. ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూముల కోసం పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. ముందుగా ఫిబ్రవరిలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధుల్లో ఆక్రమిత ప్రభుత్వ భూములపై దృష్టి పెట్టి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఉధృతంగా ఆందోళనలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం తీర్మానించింది. కబ్జాలకు గురైన భూముల్లో ఎర్రజెండాలు పాతి పేదలకు రెండు పడకల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల పంపిణీ, సామాజిక న్యాయ సాధనకు సంబంధించి ఆయా డిమాండ్లను నెరవేర్చేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రణాళికలను రూపొందిస్తోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు, కబ్జాకు గురైన దేవాలయ , భూదాన, సర్వోదయ భూముల పరిరక్షణ ఉద్యమనికి నాంది పలకాలని నిర్ణయించింది. ఇప్పటికే రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కొంతమేర భూములకు సంబంధించిన వివరాలు, కచ్చితమైన సమాచారాన్ని సేకరించిన పార్టీ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఇటువంటి భూముల వివరాలను సేకరించే పనిలో సీపీఐ నాయకులు నిమగ్నమయ్యారు.
టీఆర్‌ఎస్ సర్కార్ వచ్చినా ఏ మార్పు లేదు: చాడ
టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, కబ్జాల విషయంలో వ్యవహరిస్తున్న తీరులో ఎలాంటి మార్పులేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ‘గతంలో మాదిరిగానే ఖరీదైనభూముల ఆక్రమణలకు అధికారపార్టీ అండదండలు కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ భూముల ఆ›క్రమణల విషయంలో ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. మా భూపోరాటం ద్వారా ఈ కబ్జాలు, ఆక్రమణల వెనుక ఎవరున్నారన్నది ఎండగడతాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల వందల ఎకరాలు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. మిలిటెంట్ పంథాలో భూపోరాటాన్ని నిర్వహించి, భూసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్ సర్కార్‌పై ఒత్తిడిని పెంచుతాం. రాబోయే మరిన్ని ఉద్యమాలను చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం.’అని అన్నారు.