జిల్లాలపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలి
చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ భేటీకి నిపుణులను కూడా ఆహ్వానించి, అన్ని అంశాలపై చర్చిం చాలని సూచించారు. శుక్రవారం ఆయన సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకటరెడ్డి, సిద్ధి వెంకటేశ్వర్లు, పశ్య పద్మ, నర్సింహాతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా కాకుండా ప్రతిపక్షాల సలహాలు, సూచనలు తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రజల ప్రయోజనాలు, పాలనా సౌలభ్యానికి అనుగుణంగా జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా ప్ర యోజనం కోసం కాకుండా పాలకుల ప్రయోజనాల కోసం జిల్లాలు ఏర్పాటు చేయాలని చూస్తోందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలతోపాటు, హరితహారం పేరిట పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులను తరిమేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా... నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని సీపీఐ నిర్ణయించిందన్నారు.