సాక్షి, కల్లూరు: సామాజిక తెలంగాణ- సమగ్రాభివృద్ది లక్ష్యంగా సీపీఐ ఖమ్మం జిల్లాలో పోరుబాట కొనసాగుతుంది. ఈ పోరుబాట కల్లూరు చేరుకున్న సందర్భంగా సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ అందుబాటులో లేకుండా పోయిందని, ఈ ప్రభుత్వం అన్నదాతకు సంకెళ్ళు వేసిందని ఆయన విమర్శించారు.
కేసీఆర్ కబడ్దార్.. నీకు సంకెళ్ళు వేసే రోజులు ముందున్నాయని హెచ్చరించారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటని పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల నోట్లో మన్ను కొడుతూ ప్రజా పంపిణి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. అన్ని పార్టీలను కలుపుకుని టీఆర్‌ఎస్‌ను ఎండగడతామని చాడ పేర్కొన్నారు.
సీపీఐ పోరుబాటకు సండ్ర సంఘీభావం
ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న సీపీఐ పోరుబాట వైరా నుంచి బయలుదేరి తల్లాడ, కల్లూరు, పెనుబల్లి మీదుగా సత్తుపల్లికి చేరుకుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంఘీభావం తెలిపి తన కార్యకర్తలతో కలిసి పోరుబాటలో పాల్గొన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, అఖిలపక్ష పార్టీ శ్రేణులు, ఎమ్మార్పీఎస్‌లు కూడా సంఘీభావం తెలిపాయి. ఏకపక్ష, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందంటూ ప్రభుత్వ పనితీరును ఎండగడుతూ సీపీఐ పోరుబాటను కొనసాగిస్తున్నది. సత్తుపల్లికి చేరిన ‘పోరుబాట’కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment