రూ.కోట్లు స్నాచింగ్ | Crores of snaching | Sakshi
Sakshi News home page

రూ.కోట్లు స్నాచింగ్

Published Sun, Jan 3 2016 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

రూ.కోట్లు స్నాచింగ్

రూ.కోట్లు స్నాచింగ్

నగరంలో భారీగా చైన్‌స్నాచర్ల చేతివాటం
మూడేళ్లల్లో రూ.8.6 కోట్ల సొత్తు స్వాహా
‘దోపిడీ’కి అడ్డంకిగా మారిన ‘బాంబే’ తీర్పు

 
 సిటీబ్యూరో:   సిటీలో పంజా విసురుతున్న గొలుసు దొంగలు గడిచిన మూడేళ్లల్లో లాక్కుపోయిన సొత్తు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.8,60,54,337. అన్ని రకాలైన సొత్తు సంబంధిత నేరాల్లో ప్రజల కోల్పోయిన దాంట్లో ఇది 7.5 శాతం. ఎప్పటికప్పుడు పంథా మార్చుకుంటూ సిటీలో పంజా విసురుతున్నారు. పోలీసుల ఎత్తులకు  స్నాచర్లు పై ఎత్తులు వేస్తున్నారు. మార్కెట్‌లో బంగారం ధరలు పైపైకి దూసుకుపోతుండడంతో పాతనేరస్తులే కాదు... కొత్తవారూ స్నాచర్ల అవతారం ఎత్తుతున్నారు.  ఎలాంటి నేరచరిత్ర లేని వారు, విద్యార్థులు కూడా జల్సాల కోసం స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏటా చిక్కుతున్న స్నాచర్లలో 40 శాతం కొత్తవారే ఉంటుండడం పోలీసులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. వీరి వివరాలు, వేలిముద్రలు వంటి ఎలాంటి సమాచారం పోలీసు రికార్డుల్లో ఉండకపోవడంతో వీరిని గుర్తించడం, పట్టుకోవడం కష్టంగా మారింది. దీంతో పోలీసులకు చిక్కేవరకు నేరాలు చేసుకుంటూ పోతున్నారు.

పోలీసు యాక్షన్‌కు స్నాచర్ల రియాక్షన్...
స్నాచింగ్ నేరాల్ని కట్టడి చేయడానికి పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్నాచర్లు పైఎత్తులు వేస్తున్నారు. తెల్లవారుజామున, సాయంత్రం వేళ నిర్మానుష్య ప్రదేశాల్లో నడిచి వెళ్తున్న మహిళలను టార్గెట్‌గా చేసుకుని వాహనంపై పక్క నుంచి వెళ్తూ గొలుసుకు తెంచుకుపోతున్న స్నాచర్లకు కట్టడి చేయడం కోసం పోలీసులు రెండు రకాల వ్యూహాలు పన్నారు. ఒకటి మఫ్టీలో పోలీసుల్ని మోహరించడం.. మరోటి మహిళా పోలీసులే సాధారణ దుస్తుల్లో బంగారంతో నడిచి వెళ్లే డెకాయ్ ఆపరేషన్. ఈ రెండింటినీ గమనించిన గొలుసు దొంగలు తమ పంథాను పూర్తిగా మార్చేసుకున్నారు. ఓ ప్రాం తంలో పంజా విసిరే ముందు అక్కడ తమ ముఠా సభ్యులతో రెక్కీ చేయించి పరిస్థితులను గమనించి ‘పని’ పూర్తి చేసుకుంటున్నారు. కొన్నిసా ర్లు ఇళ్ల వద్దే ఉన్న, పనులు చేసుకుంటున్న మహిళల మెడలోని గొలుసులు తెంచుకుపోతున్నారు.

తగ్గిన కేసులు... పెరిగిన సంచలనాలు...
నగరంలో చైన్‌స్నాచింగ్స్ సంఖ్య గణనీయంగా తగ్గింది. పదేపదే నేరాలు చేస్తున్న, మూడు కంటే ఎక్కువ కేసులు ఉన్న వారిపై నగర పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడం ప్రారంభించారు. గతేడాది కమిషనరేట్ పరిధిలో రౌడీషీటర్లు, ఇళ్లలో చోరీలు చేసేవారు, గుడుంబా విక్రేతలు, మాదకద్రవ్యాల విక్రేతలు, మోసగాళ్లు, బందిపోటు దొంగలతో కలిపి మొత్తం 263 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించగా... ఇందులో 60 మంది చైన్ స్నాచర్లే ఉన్నారు. 2014లో 523గా ఉన్న కేసుల సంఖ్య గతేడాది 263గా ఉంది. అయితే ఒకేరోజు వరుసపెట్టి అనేక చోట్ల స్నాచింగ్స్ జరగడం, స్నాచర్ల బారిపడన పడిన వారిలో పలువురు వీఐపీ సం బంధీకులు ఉండటం, అనేక మంది క్షతగాత్రులు కావడం, కొందరైతే తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చేరడం తదితర సంచలనాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నేరాలు నిత్యం వార్తల్లో ప్రముఖ స్థానంలో నిలుస్తూనే ఉన్నాయి.

‘దోపిడీ’కి రెండు నెలల్లోనే బ్రేక్...
స్నాచర్స్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి నగర పోలీసులు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. స్నాచింగ్‌కు పాల్పడి చిక్కిన వారిపై ఒకప్పుడు కేవలం ఐపీసీలోని 379 (చోరీ) సెక్షన్ కింద కేసులు నమోదు చేసేవారు. అయితే ఓసారి ఇలా ఈజీ మనీకి అలవాటుపడిన వారు మళ్లీ రెచ్చిపోతుండటం, సంచనాలు నమోదు కావడంతో ఈ నేరగాళ్లకు తేలిగ్గా బెయిల్ దొరక్కుండా ఉండటానికి స్నాచింగ్ తీరుతెన్నులను బట్టి దోపిడీ కేసు (ఐపీసీ 392) నమోదు చేస్తున్నారు. దాదాపు 40 మందిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇటీవల బాంబే హైకోర్టు అక్కడి ఓ కేసులో స్నాచింగ్ నేరాన్ని దోపిడీ కింద నమోదు చేయడం తగదంటూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ వేయాల్సి వచ్చింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement