హైదరాబాద్: బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాల వద్ద శాంతియుత వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ కసరసత్తుచేస్తోంది. ఆ మేరకు జంట నగరాల అన్ని పరీక్షా కేంద్రాల వద్ద బుధవారం నుంచి సీఆర్పీసీ 144 సెక్షన్ ను విధించనున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. మహేందర్ రెడ్డి చెప్పారు.
పరీక్షా కేంద్రాలకు 500 అడుగుల పరిధిలో వ్యక్తులు గుంపులుగా సంచరించడం నిషేధమని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు సహకరించాలని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో సీపీ పేర్కొన్నారు. పోలీస్, మిలటరీ, ఫ్లైయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ఈ నిబంధన వర్తించదని, పరీక్ష కేంద్రాలకు సమీపంగా వెళ్లే అంతిమయాత్రలకు కొన్ని మినహాయింపులున్నాయని తెలిపారు. 20 తేదిన పరీక్షలు ముగిసేంత వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.