450 ఎంబీబీఎస్‌ సీట్ల కోత! | cuts to 450 MBBS seats | Sakshi
Sakshi News home page

450 ఎంబీబీఎస్‌ సీట్ల కోత!

Published Tue, Jul 4 2017 12:32 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM

450 ఎంబీబీఎస్‌ సీట్ల కోత! - Sakshi

450 ఎంబీబీఎస్‌ సీట్ల కోత!

- అన్ని సీట్లూ కన్వీనర్‌ ఆధ్వర్యంలోనే భర్తీ
వారంలో ప్రవేశాలకు మార్గదర్శకాలు
అనంతరం షెడ్యూల్‌ విడుదల  
ఈ సారి అందుబాటులో ఉన్న సీట్లు 3,250
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీడీఎస్‌ సీట్లు 1,140
అనుమతులు రాని కాలేజీలు 3
తొలిసారిగా ఉమ్మడి ప్రవేశాలు
 
సాక్షి, హైదరాబాద్‌: జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్‌) ర్యాంకులు వెల్లడైన నేపథ్యంలో వైద్య విద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రస్థాయిలో నీట్‌ ర్యాంకులను వెల్లడించిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం, వైద్య విద్య డైరెక్టరేట్‌లు... ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ సీట్ల భర్తీ ప్రక్రియ షెడ్యూల్‌ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. 2017–18 విద్యా సంత్సరంలో వైద్య విద్య కోర్సుల ప్రవేశాలు, ఫీజులు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంది. అవి రాగానే ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.
 
‘నీట్‌’ ఆధారంగానే..
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ఈసారి పూర్తిగా మారిపోనుంది. గత విద్యా సంవత్సరం వరకు.. ప్రభుత్వ కళాశాలల్లోని మొత్తం సీట్లు, ప్రైవేట్‌ కాలేజీల్లోని 50 శాతం సీట్లను ఎంసెట్‌ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేసేవారు. ఇక ప్రైవేట్‌ కాలేజీల్లోని మరో 35 శాతం సీట్లను వైద్య విద్య కాలేజీల యాజమాన్య కమిటీ ఆధ్వర్యంలో భర్తీ చేసేవారు. మిగతా 15 శాతం (ఎన్నారై కోటా) సీట్లను ఆయా కళాశాలలు నేరుగా భర్తీ చేసుకునేవి. అదే తాజా విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ వైద్య కళాశాలల్లోని అన్ని కోటాల ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్‌ సీట్లను.. పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు.
 
450 సీట్లకు కోత!
రాష్ట్రంలో ప్రస్తుతం 3,250 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఏడు ప్రభుత్వ కాలేజీల్లో 1,100 సీట్లు.. 15 ప్రైవేటు, మైనారిటీ కాలేజీల్లో కలిపి 2,150 సీట్లు ఉన్నాయి. గతేడాది మొత్తం 3,700 సీట్లు అందుబాటులో ఉండగా.. వాటిలో ఈ ఏడాదికి 450 సీట్ల కోత పడినట్లు వైద్య విద్య డైరెక్టరేట్‌ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 150 చొప్పున సీట్లున్న మహవీర్, ఆర్‌వీఎం, మల్లారెడ్డి మహిళా కాలేజీలకు ఇంకా అనుమతులు రాలేదని వెల్లడించాయి. అలాగే బీడీఎస్‌ కోర్సులో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,140 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
 
మార్గదర్శకాలు రాగానే..
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏటా మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. ఈసారి ఉమ్మడి ప్రవేశాలు జరుపుతున్న నేపథ్యంలో మార్గదర్శకాల్లో భారీగా మార్పులు ఉండే అవకాశముందని సమాచారం. ప్రభుత్వం గతేడాది ప్రైవేటు కాలేజీల్లోని సీట్ల వార్షిక ఫీజులను పెంచింది. కన్వీనర్‌ కోటాలోని 50 శాతం సీట్లకు రూ.60 వేలుగా, యాజమాన్య కోటాలో భర్తీ చేసే 35 శాతం సీట్లకు రూ.11 లక్షలుగా నిర్ణయించి.. ఎన్నారై కోటా సీట్ల ఫీజు యాజమాన్య కోటా ఫీజుకు రెట్టింపు ఉంటుందని ప్రకటించింది.

మైనారిటీ కాలేజీల్లో ఈ ఫీజులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఇక గతేడాది బీడీఎస్‌ కోర్సులో కన్వీనర్‌ కోటాకు రూ.45వేలు, యాజమాన్య కోటాకు రూ.4 లక్షలు, ఎన్నారై కోటాకు రూ.5 లక్షల ఫీజు నిర్ణయించారు. ఇలా గతేడాదే ఫీజు పెంచిన నేపథ్యంలో.. ఈసారి పెంపు ఉంటుందా లేదా అనేది మార్గదర్శకాల్లో తేలనుంది. ఇంతకాలం ఎన్నారై కోటా ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేసిన ప్రైవేటు కాలేజీలు ఉమ్మడి ప్రవేశాల నేపథ్యంలో ఎలా వ్యవహరిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement