అర్హుల రేషన్ కార్డులను పునరుద్ధరిస్తాం
సీవీ ఆనంద్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆహార భద్రతా జాబితా నుంచి తొలగించిన అర్హుల రేషన్ కార్డులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటోలు, ట్యాక్సీ కార్లు నడిపించేవారివి, 50 నుంచి 70 గజాల ఇళ్లు ఉండి జీహెచ్‌ఎంసీకి ఆస్తిపన్ను చెల్లించే వారి కార్డులను సైతం తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రేషన్ కార్డుల తొలగింపు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని, ఇప్పటి వరకు తొలగించిన వారి కార్డులను వెంటనే పునరుద్ధరించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. తొలగించిన జాబితాలో కార్డు పొందేందుకు అర్హులెవరు, అనర్హులెవరనే అంశంపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు.
కార్డు రద్దయిన లబ్ధిదారులు సరైన ధ్రువపత్రాలతో సంబంధిత పౌర సరఫరాల సర్కిల్ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు తొలగించిన కార్డుల్లో ఒక్క హైదరాబాద్‌లోనే అర్హత కలిగినవి 3,800 ఉన్నట్లు అధికారులు తేల్చారని, వాటిని వెంటనే పునరుద్ధరించినట్లు ఆనంద్ తెలిపారు. అయితే చాలా మంది రేషన్ కార్డులను కేవలం ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే పొందుతున్నట్లు తమ పరిశీల నలో తేలిందన్నారు. త్వరలో ‘360 డిగ్రీస్’ సమీకృత పౌర సమాచార నిధి ద్వారా విద్యుత్ శాఖ, మున్సిపల్, రవాణాశాఖ నుంచి వివరాలు సేకరించి అర్హులను గుర్తిస్తామన్నారు.