డబ్బులిస్తారా.. నెట్‌లో పెట్టమంటారా!
► బాహుబలి నిర్మాతలకే బెదిరింపు
►బ బరి తెగించిన పైరసీ ముఠా
► ఆరుగురిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో బేరసారాలకు దిగింది. ఢిల్లీ, బిహార్ కేంద్రాలుగా జరిగిన ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసినట్లు సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి మంగళవారం వెల్లడించారు.
ఇదీ సినిమా ప్రదర్శితమయ్యే విధానం..
చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్మాతలు దాన్ని సాఫ్ట్‌కాపీ రూపంలోకి మారుస్తారు. దీన్ని బ్రాడ్‌కాస్టర్లకు అందించడంతో వారి సర్వర్‌లో నిక్షి ప్తంచేస్తారు. ఈ బ్రాడ్‌కాస్టర్లు సినిమా సాఫ్ట్‌కాపీని ఎన్‌క్రిప్షన్‌లోకి (కోడ్ లాంగ్వేజ్) మార్చేస్తారు. దీన్ని డీక్రిప్షన్‌కు (సాధారణ చిత్రరూపం) చేసే ‘కీ’ నిర్మా తలకు అందిస్తారు. ఈ ‘కీ’ని వాడుకునే థియేటర్ల యాజమాన్యాలు చిత్రాన్ని ప్రదర్శిస్తాయి.
చిన్న లోపం పసిగట్టిన పాత ఉద్యోగి..
బాహుబలి–2 నిర్మాతలు ఆరుగురు బ్రాడ్‌కాస్టర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటిలో యూఎండబ్ల్యూ డిజిటల్ సర్వీసెస్ ఒకటి. గతంలో ఈ సంస్థలో మోను అలియాస్ అంకిత్ కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. థియేటర్‌లోని సర్వర్‌లో సినిమా కాపీ అవుతుందని తెలుసుకున్నాడు. దీంతో బాహుబలి–2కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని బిహార్‌కు చెందిన దివాకర్‌ను సంప్రదించాడు. అతడి థియేటర్‌లోనే సర్వర్‌కు ఓ ల్యాప్‌టాప్ అనుసంధానించి చిత్రానికి సంబం ధించిన హెచ్‌డీ ప్రింట్‌ను వాటర్‌మార్క్‌తో పాటు కాపీ చేశాడు. ఈ కాపీని వినియోగించి వీలున్నంత సంపాదించడానికి పట్నాకు చెందిన చందన్‌కు సమాచారం ఇచ్చాడు.
పాత ముఠాతో జతకట్టిన చందన్..
2015లో విడుదలైన బాహుబలి చిత్రం సైతం పైరసీకి గురైంది. నిర్మాతల ఫిర్యాదు మేరకు దీనికి సంబంధించి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో కేసు నమోదైంది. అప్పట్లో పోలీసులు ఢిల్లీకి చెందిన రాహుల్ మెహతాతో పాటు అతడి అనుచరులు జితేందర్‌కుమార్ మెహతా, తౌఫీఖ్, మహ్మద్ అలీల్ని అరెస్టు చేశారు. వీరి ద్వారానే బాహుబలి–2 కాపీని కూడా క్యాష్ చేసుకోవాలని భావించిన చందన్ విషయం వారికి చెప్పాడు. దీంతో రాహుల్ రంగంలోకి దిగాడు.
వారానికి రూ.15 లక్షల చొప్పున డిమాండ్..
హైదరాబాద్ వచ్చిన రాహుల్ నిర్మాతలైన ఆర్కా మీడియాను సంప్రదించాడు. తన వద్ద చిత్రం హెచ్‌డీ ప్రింట్ ఉందని.. సినిమా ప్రదర్శితమైనన్ని రోజులూ వారానికి రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఏ వారానికి చెల్లించకపోయినా వెంటనే ఇంటర్నెట్‌లో పెట్టేస్తానంటూ బెదిరించాడు. దీనిపై ఫిర్యాదును అందుకున్న ఇన్‌స్పెక్టర్ చాంద్‌భాష నేతృత్వంలోని బృందం దర్యాప్తు చేసి మూలాలు కనుగొంది. ఢిల్లీ, బిహార్‌ల్లో వరుసదాడులు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీ, దివాకర్, చందన్‌లను అరెస్టు చేశారు.
గతంలోనే అనేక సినిమాల పైరసీ
ఈ ముఠా అనేక బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాలను పైరసీ చేసింది. ఢిల్లీలో పట్టుకున్న రాహుల్, జితేందర్, తౌఫీఖ్, అలీలను న్యాయస్థానం ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసి హైదరాబాద్ వెళ్లి పోలీసుల ఎదుట హాజరవ్వాల్సిందిగా ఆదేశించింది. మిగిలిన ఇద్దరినీ బిహార్ నుంచి తీసుకువస్తున్నాం. పరారీలో ఉన్న మోను కోసం గాలిస్తున్నాం.
– అవినాష్ మహంతి, సీసీఎస్ డీసీపీ