వరదొస్తే వణుకే!
గాల్లో దీపంలా డ్యామ్‌ల భద్రత
⇒ అధ్వానంగా జూరాల, సింగూరు జలాశయాల నిర్వహణ
⇒ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌కు కనీస సిబ్బంది కరువు
⇒ ఆకస్మిక వరదొచ్చినా.. ఆపదొచ్చినా రిటైర్డ్ సిబ్బందే దిక్కు
⇒ మొన్నటి వరద సమయంలో నానా తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన జలాశయాల భద్రత గాల్లో దీపంలా మారింది. సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తున్న డ్యామ్‌ల భద్రతకు పెద్దపీట వేయాల్సిన నీటి పారుదల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ముఖ్యంగా జూరాల, సింగూరు డ్యామ్‌ల నిర్వహణ ప్రమాదకరంగా మారిందని, వీటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్(ఓఅండ్‌ఎం)లకు తగిన సిబ్బందిని నియమించాలని పలు కమిటీలు సూచించినా.. అదేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో జూరాల, సింగూరు డ్యామ్‌లకు భారీగా వరద వచ్చిన సందర్భాల్లో వాటి నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.
జూరాల.. స్పిల్‌వే రోడ్డుకు ప్రత్యామ్నాయమేది?
జూరాల ప్రాజెక్టును 1995లో 1.04 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే లక్ష్యంతో నిర్మించారు. 12.50 లక్షల క్యూసెక్కుల డిశ్చార్జి సామర్థ్యంతో 927 మీటర్ల పొడవుతో స్పిల్‌వేలు నిర్మించారు. 62 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. స్పిల్‌వే పై ఉన్న బ్రిడ్జి మీదుగా ఆత్మకూరు, గద్వాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. కార్లు, బస్సులు, లారీలు వంటి భారీ వాహనాలు బ్రిడ్జిపై నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి. 2012లో డ్యామ్ భద్రతను పర్యవేక్షించిన ప్రత్యేక బృందం.. వాహనాల రాకపోకలతో భవిష్యత్‌లో డ్యామ్ నిర్మాణానికి పగుళ్లు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
డ్యామ్ గేట్లను తెరవడానికి, సరి చేయడానికి ఉపయోగించే క్రేన్ వ్యవస్థకు ఈ వాహనాల రాకపోకలతో ప్రమాదం ఉందని, క్రేన్ మార్గం దెబ్బతింటే దాన్ని ఆపరేట్ చేయడం సులువు కాదని తెలిపింది. ప్రాజెక్టుకు వరదలు సంభవించిన సమయంలో గేట్ల నిర్వహణ మరీ ప్రమాదకరంగా ఉంటోందని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 25న ఏకంగా 19.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీన్ని కట్టడి చేసేందుకు అధికారాలు నానా తంటాలు పడాల్సి వచ్చింది. స్పిల్‌వే డ్యామ్‌పై వాహనాలు వెళ్లకుండా ప్రత్యామ్నాయంగా డౌన్ స్ట్రీమ్‌లో రోడ్డు బ్రిడ్జి కట్టాలని పలు కమిటీలు సూచనలు చేసినా అది సాధ్యం కాలేదు. ఇక స్పిల్‌వే ఓఅండ్‌ఎంల కోసం వర్క్ ఇన్స్‌పెక్టర్, గేటు ఆపరేటర్లు, ఫిట్టర్లు, ఎలక్ట్రిషియన్లు, వాచ్‌మెన్‌లు, ఆపరేటర్లు కలిపి మొత్తంగా 19 మంది వరకు కావాల్సి ఉండగా... ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. గతేడాది వరద సమయంలో గేట్ల నిర్వహణ కోసం రిటైర్డ్ సిబ్బంది సేవలను వినియోగించుకున్నారు.
సమయానికి తెరుచుకోని సింగూరు గేట్లు
సింగూరు ప్రాజెక్టు 1989లో 29.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. ప్రాజెక్టు స్పిల్‌వే 327 మీటర్లు కాగా.. 17 క్రస్ట్ గేట్లున్నాయి. 8.19 లక్షల క్యూసెక్కుల వరదను డిశ్చార్జి చేసే సామర్థ్యం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇక్కడ 20 రోజుల్లోనే 75 టీఎంసీల మేర వరద వచ్చింది. ఈ సమయంలో ప్రాజెక్టు ప్రొటోకాల్ ప్రకారం మధ్య గేట్లు మొదట తెరవాల్సి ఉండగా.. అవి తెరుచుకోలేదు. దీంతో ఇతర గేట్లను తెరిచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ఓఅండ్‌ఎంను పూర్తిగా గాలికి వదిలే యడం.. రోప్ వైర్ల నిర్వహణను గాలికొదిలేయడమే దీనికి కారణమని తేల్చారు. ప్రాజెక్టు పరిధిలో 13 మంది సిబ్బంది కావాల్సి ఉండగా.. కేవలం ఒక హెల్పర్, ఇద్దరు వాచ్‌మెన్‌లతో నెట్టుకొస్తు న్నారు. నైపుణ్యం గల సిబ్బంది లేకుండా వరద, నీటి మట్టాల నిర్వహణ ఎలా చేపడతా రని, ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఎలా అని నిపుణుల కమిటీ అప్పట్లోనే ప్రశ్నించింది.