రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు | Dasara, diwali Festival Effect: hike in platform ticket fare from Rs. 20 | Sakshi
Sakshi News home page

రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు

Published Wed, Sep 28 2016 7:22 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు - Sakshi

రైల్వే ఫ్లాట్ఫామ్ టికెట్ ధర రూ.20కి పెంపు

హైదరాబాద్: పండుగ రద్దీ పేరుతో రైల్వే శాఖ కూడా ప్రయాణికుడిపై బాదుడు షురూ చేసింది. దసరా, దీపావళి సందర్భంగా సెలవుల దృష్ట్యా రైల్వేశాఖ అదనపు చార్జీల పేరుతో ప్రయాణికుడిపై ముప్పేట దాడికి పాల్పడుతోంది. ఈ పండుగల ఎఫెక్ట్తో దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్ఫాం టికెట్ ధర ఇప్పుడు రూ.20కు పెంచింది.  ఈ నెల 30 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకూ ఈ పెంపు అమల్లో ఉంటుంది. ఇక పండగొచ్చిందంటే చాలు.. రైల్వేశాఖ రెట్టింపు అదనపు చార్జీలతో ప్రయాణికులను వీరబాదుడు బాదుతోంది.

ఒకవైపు ఏడాదికి పైగా వివిధ రూట్‌లలో ‘సువిధ’ పేరుతో నడుపుతున్న రైళ్లలో చార్జీలను రెట్టింపు చేయగా, ఇటీవల ‘ఫ్లెక్సీ ప్రైస్’ పేరుతో రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో చార్జీల మోత మోగించారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రతి 10 శాతం బెర్తులపైన భారాన్ని పెంచేశారు. తాజాగా దసరా, దీపావళి, తిరుమల బ్రహ్మోత్సవాల పేరిట అక్టోబర్, నవంబర్ నెల ల్లో నడుపనున్న 52 ప్రత్యేక రైళ్లను సైతం వదిలి పెట్టకుండా సాధారణ చార్జీల స్థానంలో ’తత్కాల్‌‘ చార్జీలు విధించి అదనపు దోపిడీకి తెరలేపారు.

ప్రయివేట్ బస్సులు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం భారంగా భావించే సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులు తక్కువ చార్జీలతో రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. కానీ, రకరకాల పేర్లతో రైల్వే సైతం ప్రయాణికులపై దోపిడీ పర్వం కొనసాగిస్తోంది. దీంతో ఇప్పటి వరకు చౌకగా ఉన్న రైలు ప్రయాణం సైతం భారంగా మారింది.

ప్రత్యేక రైళ్లలో తత్కాల్ చార్జీలు

తిరుమల బ్రహోత్సవం, దసరా, దీపావళి పర్వదినాల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ మేరకు 52 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను సిద్ధం చేసింది. కానీ, ఈ ప్రత్యేక రైళ్లన్నింటికీ తత్కాల్ చార్జీలు వర్తించనున్నాయి. హైదరాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-మైసూర్, సంత్రాగచ్చి (కోల్‌కతా) -సికింద్రాబాద్, సికింద్రాబాద్-విజయవాడ మధ్య, సికింద్రాబాద్- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ రెండో వారం వరకు ఇవి నడుస్తాయి.


దీంతోపాటు సెలవుల దృష్ట్యా రద్దీ ఉండే మార్గాల్లో 53 ‘సువిధ’ రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. దీంతో ప్రయాణికులపై సాధారణ చార్జీలపైన రెట్టింపు భారం పడనుంది. ఈ రైళ్లను విశాఖ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్‌లో మార్గాల్లో వేసవి సెలవుల సందర్భంగా ఏప్రిల్, మే, జూన్ నెల ల్లో నడుపనున్నారు.

తత్కాల్‌తో మొదలై రెండున్నర రెట్లు అధికం...
గతంలో ప్రీమియం రైళ్ల పేరుతో బెర్తుల బేరానికి దిగిన రైల్వే ఇప్పుడు ‘సువిధ’గా పేరు మార్చుకుంది. ఈ రైళ్లలో సాధారణ చార్జీలు ఉండవు. ఏసీ,నాన్ ఏసీ బోగీల్లో తత్కాల్‌తోనే చార్జీలు మొదలవుతాయి. అడ్వాన్స్ బుకింగ్‌లు పెరిగి, బెర్తులు నిండుతున్న కొద్దీ చార్జీలు పెరుగుతాయి. మొదట తత్కాల్‌తో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరుగుతాయి.

ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌క్లాస్ చార్జీ రూ.365 ఉంటుంది. కానీ, సువిధ రైళ్లలో ఇది తత్కాల్ చార్జీలతో అంటే రూ.470తో మొదలవుతుంది. మొదటి 25 బెర్తుల వరకు ఈ చార్జీలు ఉంటాయి. ఆ తరువాత 26వ బెర్తు నుంచి నుంచి 50వ బెర్తు వరకు రెట్టింపవుతాయి. అంటే ఈ చార్జీ రూ.900 వరకు ఉంటుంది. 51వ బెర్తు నుంచి 72వ బెర్తు వరకు రెట్టింపు కన్నా ఎక్కువే ఉంటుంది.

ఇది రూ.1200 నుంచి రూ.1300 వరకు పెరుగుతుంది. ఇలా ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో ప్రయాణికుల డిమాండ్ మేరకు చార్జీలు అనూహ్యంగా పెరుగుతాయి. అలా బెర్తులు తగ్గిన కొద్దీ చార్జీలు రెట్టింపవుతాయి. విమానాల్లో ఈ తరహా డైనమిక్ చార్జీలు ఉన్నప్పటికీ ప్రయాణికుల డిమాండ్ లేకపోతే చార్జీలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కానీ, రైళ్లలో అలా కాదు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొనే ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తారు. కాబట్టి ఇంక తగ్గించే ప్రసక్తే ఉండదు. క్రమంగా పెరుగుతూనే ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement