‘డబుల్’పై దిద్దుబాట
హైకోర్టు వ్యాఖ్యలతో దిగివచ్చిన ప్రభుత్వం
రెండు పడకల ఇళ్లపై మరో ఉత్తర్వు జారీ
జిల్లా కమిటీకి లబ్ధిదారుల ఎంపిక బాధ్యత
కమిటీలో సభ్యులుగా జిల్లా ఎమ్మెల్యేలు
చైర్మన్‌గా జిల్లా మంత్రి.. కన్వీనర్‌గా కలెక్టర్
అర్హులను తేల్చేందుకు కలెక్టర్ గ్రామ సభలు
అనంతరం డ్రా ద్వారా లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక విధానాన్ని ప్రభుత్వం మార్చింది. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గానికి సంబంధించి లబ్ధిదారులను 50:50 నిష్పత్తిలో ఎంపిక చేసేలా విధివిధానాలను ఖరారు చేస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. దీన్ని హైకోర్టు తప్పుపట్టడంతో ప్రభుత్వం పాత విధానాలకు సవరణ చేస్తూ గురువారం ఉత్తర్వు జారీ చేసింది. జిల్లా స్థాయిలో కమిటీ వేస్తామని, దాని ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుందని అందులో స్పష్టం చేసింది. పార్టీలకతీతంగా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. దీనికి జిల్లా మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా యూనిట్‌గా ఈ కమిటీ వ్యవహరిస్తుంది. ఆయా యోజకవర్గాలు/
మున్సిపాలిటీల్లో అయితే వార్డులు, డివిజన్ల వారీగా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యమిస్తూ వారికి ప్రత్యేక కోటాను కొనసాగిస్తారు.
జిల్లా మంత్రి, ఎమ్మెల్యే ఎంపిక చేసిన జాబితాను మండలాల స్థాయిలో తహసీల్దార్లు పరిశీలించి అర్హతను తేలుస్తారంటూ పాత విధానంలో పొందుపరిచారు. ఇప్పుడు దాన్ని కూడా మార్చారు. ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిల్లో అర్హమైనవి తేల్చేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా గ్రామసభ/వార్డుసభలు నిర్వహిస్తారు. అనంతరం జాబితాను తహసీల్దార్లకు పంపితే వారు మరోసారి పరిశీలించి అర్హులా కాదా అని నిర్ధారిస్తారు. అనంతరం మరోసారి గ్రామసభ నిర్వహించి మంజూరైన ఇళ్ల సంఖ్యకు తగ్గట్టుగా లబ్ధిదారులను డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ జాబితాను జిల్లా స్థాయి కమిటీ ముందుంచి ఆమోదముద్ర వేయిస్తారు. వీటిపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తినా, ఫిర్యాదు చేసినా విచారించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా ఓ అధికారిని నియమిస్తారు. పట్టణ ప్రాంతాలకు సంబంధించి ‘హౌజ్ ఫర్ ఆల్’ పథకం కింద కేంద్రప్రభుత్వం జారీ చేసిన విధివిధానాలను డబుల్ బెడ్రూం పథకంలో అనుసరించాల్సి ఉంటుందని తాజా ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోర్టు స్పందనతో చకచకా...
జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలే లబ్ధిదారులను ఎంపిక చేసేలా తొలుత రూపొందించిన మార్గదర్శకాలను హైకోర్టు తప్పుపట్టడంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రజాప్రతినిధులు లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించటమే కాకుండా అందుకు ప్రత్యేకంగా ఓ కమిటీ ఉంటే బాగుంటుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలుకు గడువు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం దానితో నిమిత్తం లేకుండా వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగడం గమనార్హం.