ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎలా అప్పగిస్తారు?
'డబుల్' ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై హైకోర్టు
♦ ఎంపిక ప్రక్రియకు ఓ నిర్దిష్ట విధానం ఉంటుంది
♦ ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉన్నాయి
♦ వాటిని ఉపసంహరించుకుని తాజా జీవో ఇవ్వడం మంచిదని వ్యాఖ్య
♦ కౌంటర్ దాఖలు చేస్తామన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది
♦ అంగీకరించిన ధర్మాసనం.. విచారణ 30కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. ఆ ఉత్తర్వులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. వారికి బదులు అధికారులతో కూడిన కమిటీకి లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను అప్పగించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. అసలు ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజల నుంచి ఎలా దరఖాస్తులను స్వీకరిస్తారని, ఇటువంటి ఉత్తర్వులను ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. వాటిని ఉపసంహరించుకుని, తాజాగా జీవో జారీ చేయడం మంచిదని అభిప్రాయపడింది. అయితే దీనిపై గడువునిస్తే పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేస్తామని, ప్రస్తుతానికి లబ్ధిదారులను ఎంపిక చేయబోమని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది బి.మహేందర్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. ఈ మేరకు గడువు ఇచ్చిన హైకోర్టు... తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు పడక గదుల ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ కరీంనగర్‌కు చెందిన జి.దేవదాస్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యం రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను సగం మంత్రులకు, సగం ఎమ్మెల్యేలకు అప్పగించారని... ఇది చట్టవిరుద్ధమని కోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. ఆ జీవో పట్ల తాము కూడా సంతృప్తికరంగా లేమని పేర్కొంది. లబ్ధిదారుల ఎంపికకు ఓ నిర్దిష్ట విధానం ఉంటుం దని, అందుకు విరుద్ధంగా ఎంపిక బాధ్యతను ప్రజాప్రతినిధులకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్‌రెడ్డి స్పందిస్తూ.. లబ్ధిదారులను మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపిక చేసినా కూడా... గ్రామ సభల్లో పరిశీలించిన తరువాతే జాబితాను ఖరారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కౌంటర్ రూపంలో కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది.