మీడియా ద్వారానే ప్రజాస్వామ్యం
* అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ వెల్లడి
* ఐజేయూ ఆధ్వర్యంలో ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువల’పై చర్చ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, అలాంటి వాతావరణం మీడియా ద్వారానే సాధ్యమని అమెరికా కాన్సుల్ జనరల్ మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు. మీడియా చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినం సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) ఆధ్వర్యంలో ‘విస్తరిస్తున్న మీడియా- జర్నలిస్టుల నైతిక విలువలు’ అనే అంశంపై చర్చ నిర్వహించారు.
ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మైఖేల్ ముల్లిన్స్‌తోపాటు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ప్రెస్ కౌన్సిల్ సభ్యుడు కె.అమరనాథ్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, హిందూ బిజినెస్‌లైన్ డిప్యూటీ ఎడిటర్ ఎం.సోమశేఖర్, ప్రొఫెసర్ పి.వినోద్ తదితరులు పాల్గొన్నారు. బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే మీడియా వాతావరణం పారదర్శకంగా, స్వేచ్ఛగా ఉండాలని మైఖేల్ ముల్లిన్స్ పేర్కొన్నారు.
మీడియా ఏదైనా సమాచారాన్ని అందించడమే కాదు.. ఆ ఘటన ఎందుకు జరిగింది, అందులో ఉన్న మర్మమేమిటి, దానిపై ప్రభుత్వం, పౌర సమాజం ఏమని భావిస్తున్నాయనే అంశాలను కూలంకషంగా వివరిస్తుందని చెప్పారు. చాలా దేశాల్లో ఆందోళనకరమైన వాతావరణం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పత్రికల మూసివేత, వార్తల పట్ల సెన్సార్ విధించడం, సరైన వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురిచేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. వ్యతిరేక వార్తలు రాసేవారిపై భౌతిక దాడులకు దిగుతున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
విపరీత పోకడల వల్ల వృత్తికే ఇబ్బంది: ఎమ్మెల్సీ రామచంద్రరావు
మీడియా వృత్తి ఆహ్వానించదగినదేగానీ, విపరీత పోకడల వల్ల వృత్తికే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు అభిప్రాయపడ్డారు. కావాలంటే పత్రిక పాలసీకి తగినట్లుగా ఎడిటోరియల్ పేజీలో అభిప్రాయాలు చెప్పుకోవచ్చన్నారు. స్టింగ్ ఆపరేషన్ల పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను హరించరాదని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ మీడియాను స్వీయ నియంత్రణలో ఉంచడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాదిరి ఒక వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
చెల్లింపు వార్తలు ప్రజాస్వామ్యానికి చేటని, వాటిని నిలువరించాలని కోరారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించే అంశం చాలా కాలం నుంచి నానుతోందని, ఈ విషయమై ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కమ్యూనిటీ మీడియా యునెస్కో చైర్మన్, ప్రొఫెసర్ వినోద్ పావురాల అభిప్రాయపడ్డారు. కమ్యూనిటీ రేడియో వంటి ప్రసార సాధనాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరారు.
అమెరికాలో సీఐఏ అధికారులు లాడెన్‌ను కాల్చిచంపిన పోస్టులను రీట్వీట్ చేసిన అంశంపై అక్కడి మీడియా రక్షణ శాఖను ప్రశ్నించిందని, అలాంటి పరిస్థితులు భారత్‌లో కూడా రావాలని ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ పేర్కొన్నారు. అమెరికాలో స్టింగ్ ఆపరేషన్ చేస్తే అక్కడి ప్రభుత్వాలు మీడియా సలహాలు సూచనలు స్వీకరిస్తాయని... అలాంటి పరిస్థితి భారత్‌లో లేదని ఎం.సోమశేఖర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో కూడా అభివృద్ధి చెందిన దేశాల్లో మీడియాకు ఇస్తున్న స్వేచ్ఛ, ప్రాధాన్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.