డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
* ఎంసెట్‌కు హాజరయ్యే వారికి ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్య పటిష్టానికి పక్కా చర్యలు చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శుక్రవారం ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు కాలేజీల విద్యార్థులు ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన నేపథ్యంలో ప్రభుత్వ కాలేజీల్లోనూ ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేస్తామని, ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను అభివృద్ధి చేస్తామని చెప్పారు.
ఇందులో భాగంగా లెక్చరర్లకు ఓరియంటేషన్ తరగతులను నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. లెక్చరర్లు కూడా బాగా పని చేయాలని, ప్రభుత్వ కాలేజీల్లోనే ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. వార్షిక పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం నిర్వహించిన ప్రత్యేక తరగతుల నిర్వహణ కార్యక్రమం సత్ఫలితాలిచ్చిందన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ మరిన్ని ప్రయోగాలు చేపట్టనున్నామని, వచ్చే ఏడాది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. అలాగే ఎంసెట్‌కు సిద్ధమయ్యే ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తామన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు, అందుబాటులోకి వచ్చే సీట్ల వివరాలను ఈనెల 28న తెలుస్తాయన్నారు. త్వరలోనే వర్సిటీలకు వీసీల నియామకంపై చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న కడియం... ఆ విధానం అమలుపై పరిస్థితులకు అనుగుణంగా వర్సిటీలే నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఈ విధానాన్ని దశలవారీగా అమలు చేస్తామన్నారు. జేఎన్‌టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ కోర్సును రద్దు చేయబోమని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఓయూ పీజీ కోర్సుల్లో సీబీసీఎస్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య వెల్లడించారు. డిగ్రీ స్థాయిలో సీబీసీఎస్ అమలుకు ఏర్పాట్లపై దృష్టి సారించామన్నారు. ఏపీ ఇంటర్ బోర్డు డబ్బును విజయవాడకు తరలించిన వ్యవహారంలో కేసు పెడతామన్నారు. కాగా, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్య అందించాలని నిర్ణయించినందుకు కడియంకు ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, విద్యార్ధులు ధన్యవాదాలు తెలిపారు.
ఇంటర్ విద్య పటిష్టతకు చర్యలు
Published Sat, Jun 27 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement
Advertisement