కృష్ణా నదిలో అక్రమ కట్టడాల్ని కూల్చివేయండి | Destroy the illegal structures in the Krishna River : MLA RK | Sakshi
Sakshi News home page

కృష్ణా నదిలో అక్రమ కట్టడాల్ని కూల్చివేయండి

Published Tue, Sep 19 2017 2:09 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Destroy the illegal structures in the Krishna River : MLA RK

హైకోర్టులో ఎమ్మెల్యే ఆర్కే ‘పిల్‌’దాఖలు
 
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా డెల్టాకు జీవనాధారమైన కృష్ణా నది గట్లపై యథేచ్ఛగా జరిగిన అక్రమ నిర్మాణాల్ని కూల్చివేయాలంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. నదీ పరీవాహక ప్రాంతంలో అవన్నీ అక్రమ నిర్మాణాలే అని అధికారులు తేల్చి నోటీసులు ఇచ్చినా.. వాటిని కూల్చేస్తామని సాక్షాత్తు జలవనరుల శాఖ మంత్రి ప్రకటించినా ఫలితం లేకపోయింది. ఉండవల్లి తహసీల్దార్‌ 2015 మార్చిలో కృష్ణా నదికి వందల గజాల సమీపంలోని నిర్మాణాలకు నోటీసులు ఇచ్చాక ఒక అక్రమ కట్టడాన్ని సీఎం  చంద్రబాబు తన నివాస భవనంగా ఎంచుకోవడంతో వాటి జోలికి అధికారులు వెళ్లలేదంటూ మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిల్‌ దాఖలు చేశారు. గతంలో దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు.. సంబంధిత అధికారులకు మరోసారి ఫిర్యాదు చేయాలని, వారు దాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ కేసును క్లోజ్‌ చేసింది.

ఈ మేరకు తాను అధికారులకు ఫిర్యాదు చేసి ఏడాది దాటినా చర్యలు లేకపోవడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వ్యాజ్యంలో ఆళ్ల వివరించారు. ఇందులో జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి/ఈఎన్‌సీ, కృష్ణా/గుంటూరు జిల్లాల కలెక్టర్లు, కృష్ణా డెల్టా సెంట్రల్‌ డివిజన్, రివర్‌ కన్జర్వేటర్, ఉండవల్లి తహసీల్దార్‌ తదితర.. మొత్తం ఎనిమిదిమంది అధికారులతో పాటు 49 మందిని వ్యక్తిగతంగా ప్రతివాదుల్ని చేశారు. వీరిలో 32 అతిథిగృహాల యజమానుల్లో కొందరైన లింగమనేని రమేష్‌ (సీఎం నివాసం ఉండే అతిథి గృహ యజమాని), గోకరాజు గంగరాజు (నర్సాపురం బీజేపీ ఎంపీ) ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement