
సీఎం నివాసం ఉంటున్న భవనం
నది గట్లపై ఉన్న అతిథి గృహాలన్నీ అక్రమ నిర్మాణాలేనని 2015 మార్చిలో తాడేపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారని, వీటిని కూల్చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా, ఆచరణలో అది జరగలేదని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. లింగమనేని రమేశ్‌కు చెందిన అతిథి గృహాన్ని నివాస భవనంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ఎంచుకున్నారని, అందువల్లే అధికారులెవ్వరూ అక్రమ కట్టడాల జోలికి వెళ్లడం లేదన్నారు. అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.
నదీ పరీవాహక ప్రాంతంలోగాని, నదుల గట్లపైగాని ఏవిధమైన నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరిస్తూ.. కులు–మనాలిలో కమలనాథ్ నిర్మాణంపై తీర్పును ఆయన ప్రస్తావించారు. అక్రమ కట్టడాల వల్ల కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయని, దిగువ ప్రాంతాల్లోని గ్రామాలపై ఆ ప్రభావం చూపుతోందన్నారు. విజయవాడలోని దుర్గమ్మ ఆలయ భక్తులు స్నానమాచరించేందుకు కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు.
వాదనల అనంతరం పిల్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి/ఈఎన్‌సీ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, కృష్ణా డెల్టా సెంట్రల్ డివిజన్ రివర్ కన్జర్వేటర్, తాడేపల్లి తహసీల్దార్.. తదితర ఎనిమిది మంది అధికారులతో పాటు మరో 49 మందికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన ధర్మాసనం విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. నోటీసులు జారీ అయిన 32 అతిథి గృహాల యజమానుల్లో లింగమనేని రమేశ్ (సీఎం నివాసం ఉండే అతిథి గృహ యజమాని), గోకరాజు గంగరాజు (నర్సాపురం బీజేపీ ఎంపీ) కూడా ఉన్నారు.