సుప్రీంలో సవాలు చేస్తాం: ఆర్కే
కేసులు కొట్టించేసుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ఆడియోటేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని తాము శాస్త్రీయంగా నిరూపించినా కేసును కొట్టేశారని, ఇక ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు విషయంలో లోకస్ స్టాండీ మీద కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు పీవీ నరసింహారావు, జయలలిత లాంటి చాలామంది పెద్దలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేయలేదని, ఎలాంటి తప్పు చేయలేదన్న నమ్మకం చంద్రబాబుకు ఉంటే ఆయన ఎందుకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నించారు.
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మీద విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో ఒకప్పుడు పీవీ నరసింహారావు కూడా శిక్ష అనుభవించారని, కానీ ఇప్పుడు మాత్రం ఓటుకు నోటు ఇచ్చి కొన్నా అది అవినీతి కిందకు రాదని తీర్పులో ఉటంకించారని చెప్పారు. కేసు దాఖలు చేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకస్ స్టాండీ లేదని కోర్టు చెప్పిందని తెలిపారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరైనా కోర్టు దృష్టికి తెచ్చి ప్రైవేటు కేసు దాఖలు చేయవచ్చని ఇంతకుముందు కొన్ని కేసుల్లో చెప్పారని అన్నారు. ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని, రెండేళ్ల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టే తాము కేసు దాఖలుచేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు.