పోలీస్ అధికారులకు కొత్త వాహనాలు
- అన్ని స్థాయిలవారికి ప్రభుత్వం మంజూరు చేసింది
- కొత్త జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమీక్షలో డీజీపీ అనురాగ్ శర్మ
హైదరాబాద్: ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కావాల్సిన కనీస సదుపాయల్లో కార్యాలయ భవనంతో పాటుగా ఫర్నిచర్, పూర్తి స్థాయిలో సిబ్బంది, కంప్యూటర్లు, ఫ్యాక్స్, జిరాక్స్ మిషన్లు అన్నీ త్వరగా సమకూర్చుకోవాలని కొత్త ఎస్పీలు, పోలీసు కమిషనర్లను రాష్ట్ర పోలీసు విభాగం డైరెక్టర్ జనరల్ అనురాగ్ శర్మ ఆదేశించారు.
ప్రభుత్వం నూతన వాహనాలను మంజూరు చేసిందని, అన్ని స్థాయిల అధికారులకు వాహనాలు ఇస్తామని ఆయన తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో పాత, కొత్త జిల్లాల ఎస్పీలు, నూతన పోలీస్ కమిషనర్లతో కొత్త జిల్లాల్లో గత తొమ్మిదిరోజుల అనుభవాలను డీజీపీ సమీక్షించారు. ప్రభుత్వం ముందుచూపుతో ఆలోచించి ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లో ప్రభుత్వం, ప్రజలు ఆశించిన విధంగా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు పని చేయాలని అన్నారు.
ప్రస్తుతం తాము పనిచేస్తున్న కార్యాలయాల ఫోటోలు, సిబ్బంది గదులు, నూతన పోలీసు స్టేషన్లు, సర్కిల్ల కార్యాలయ ఫోటోలు, సిబ్బంది వివరాలతో నూతన జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమీషనర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వార డీజీపీకి వివరించారు. జిల్లా భౌగోళిక స్వరూపం, అక్కడి రాజకీయ వాతావరణం, ప్రజల అవసరాలు, వారి సంప్రదాయం అన్నీ కూడా జిల్లా ఎస్పీలు బాగా స్టడీ చేయాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధ్యాన్యం ఇవ్వాలన్నారు. కార్యాలయాలు పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, ఈ లోపు తమ అవసరాలని ప్రాధాన్యతలను ఉన్నతాధికారులకు తెలియచేస్తూ వుండాలన్నారు. సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, రామగుండం, కరీంనగర్, వరంగల్, పోలీస్ కమీషనర్లతో పాటుగా అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు పాల్గొన్నారు.