‘భూమాయ’లో మంత్రి తలసాని హస్తం
సీబీఐ విచారణకు ఆదేశించాలి: దిగ్విజయ్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు ప్రమేయం ఉందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. బహుశా కేసీఆర్‌కు, ఆయన కుటుంబానికి డబ్బుల వసూలు కోసమే శ్రీనివాసయాదవ్‌లాంటి వ్యక్తులు అవసరమేమోనని వ్యాఖ్యానించారు. ఈ భూకుంభకోణంలో కేసీఆర్ సర్కారు సరైన విచారణ జరుపుతుందన్న నమ్మకం లేదని.. అందువల్ల సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే భూములపై కాంగ్రెస్ హయాం నుంచీ విచారణ జరిపించినా తమకు అభ్యంతరం లేదన్నారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. మియాపూర్ భూముల కుంభకోణంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ప్రమేయముందని దిగ్విజయ్ ఆరోపించారు. అధికారుల అండతో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయన్నారు. భూదాన్ భూములు ఏమయ్యాయో, మిగిలిన భూములు ఎక్కడ, ఎవరి చేతుల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మియాపూర్ భూములు కూడా అదే కోవలో మాయవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కుంభకోణంలో సబ్‌రిజిస్ట్రార్లను బదిలీ చేశారుగానీ ముఖ్య నాయకులను వదిలేశారని వ్యాఖ్యానించారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులోనూ పోలీసుల మీద చర్య తీసుకుని రాజకీయ నాయకులను వదిలేశారని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికలకు సిద్ధం: 2019లో జరిగే ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోందని, అసెంబ్లీ సీట్ల వారీగా సూక్ష్మ పరిశీలన చేస్తున్నామని దిగ్విజయ్ తెలిపారు. మొత్తం 119 సీట్లకు పోటీ చేస్తామన్నారు. ఏపీలో తాము టీడీపీని వ్యతిరేకిస్తున్నామని, తెలంగాణలోనూ టీడీపీ అవసరం లేదని.. ఈ విషయంలో సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఏ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదన్నారు. అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు మీడియా హైప్ ఇచ్చిందని, అనేక చేరికలు ఉంటాయని ప్రచారం జరిగినా అటువంటిదేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణలోనూ ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ కార్డును ఉపయోగించి ఓట్లు చీల్చాలనేది బీజేపీ ప్రయత్నమని విమర్శించారు.