విడాకులు మంజూరు కాగానే అమృతతో పెళ్లి: దిగ్విజయ్
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ లాగా తాను పిరికివాడిని కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహరాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. అందుకే టీవీ జర్నలిస్టు అమృతారాయ్తో తన వివాహం వ్యక్తిగతమైనప్పటికీ ఆమెతో తనకు గల సంబంధాన్ని దాచి పెట్టలేదని... ధైర్యంగా బహిరంగ పరిచినట్లు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అమృతతో తన వివాహం విషయంలో ఎటువంటి విమర్శలు ఎదురైన ధైర్యంగా ఎదుర్కోగలని వెల్లడించారు. అమృతారాయ్కు కోర్టు విడాకులు మంజూరు చేసిన వెంటనే పెళ్లి చేసుకుంటామని చెప్పారు.
నరేంద్ర మోడీ చట్టాలను ఉల్లంఘించే వ్యక్తిగా దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా అభివర్ణించారు. అందుకు పోలింగ్ రోజున ఎన్నికల కోడ్ను మోడీ ఉల్లంఘించారని దిగ్విజయ్ సోదాహరణగా వివరించారు. పార్లమెంట్లో ఫుడ్ సెక్యూరిటీ బిల్లును కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకించాయని.... అయితే అవే కార్పొరేట్ సంస్థలు మోడీని సమర్థిస్తున్నాయని దిగ్విజయ్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ ... 10 ఏళ్లలో తమ పార్టీ పాలనలో దేశంలో ఆర్థిక వృద్ధిరేటు సాధ్యమైందని దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. మేడే సందర్భంగా గురువారం హైదరాబాద్ లో గాంధీ భవన్ లో ఐఎన్ టీయుసీ జెండా ఎగరవేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్బంగా అమృతారాయ్ తో వివాహం ఎప్పుడు అంటూ విలేకర్ల అడిగిన ప్రశ్నకు దిగ్విజయ్ సింగ్ పై విధంగా సమాధానం చెప్పారు.