జానా తీరుపై దిగ్విజయ్ అసంతృప్తి?
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షనేత జానారెడ్డి తీరుపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దిగ్విజయ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా గురువారం ఆయనను పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో జానా వ్యవహరించిన తీరుతో పార్టీకి నష్టం కలిగిందని రంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు దిగ్విజయ్‌కు ఫిర్యాదు చేశారు. జీహెచ్‌ఎంసీ రూ.ఐదు భోజనం తిని, చాలా బాగుందని జానా ప్రశంసించారని.. దాంతో నష్టం జరిగిందని వివరించారు. జానాని ప్రతిపక్ష నేత పదవి నుంచి తప్పించాలని కోరారు. దీంతో జానారెడ్డి తీరుపై దిగ్విజయ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల సమయంలో జానా అలా వ్యవహరించడం వెనుక కారణమేమిటని పార్టీ నేతలను ఆరా తీసినట్లు సమాచారం. వాస్తవాలు తెలుసుకుందామని, ఆ తరువాత ఏం చేద్దామో నిర్ణయించుకుందామని దిగ్విజయ్ పేర్కొన్నట్లు తెలిసింది.