‘ఇజ్జత్’ పోయింది: రాయితీ పాసుల రద్దు
రాయితీ పాసులను రద్దు చేసిన రైల్వే
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో సతమతమవుతున్న రైల్వేను గాడిలో పెట్టే క్రమంలో సంస్కరణలకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ‘రాయితీ’లకు మంగళంపాడే దిశగా అడుగులేస్తోంది. వీలైనంతవరకు ఆదాయాన్ని తెచ్చేపెట్టే అంశాలకే ప్రాధాన్యమిస్తూ ఆర్థిక భారాన్ని మిగిలుస్తున్న వాటిని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ‘ఇజ్జత్’ పాసులను రద్దు చేసింది. అధికారికంగా ప్రకటన చేయకుండానే పాసుల జారీని నిలిపివేసింది.
అనర్హులు పెరిగి అసలుకే మోసం..
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారిపై ప్రయాణ భారం పడకుండా ఉండేందుకు 2009లో రైల్వే శాఖ ఇజ్జత్ పథకం ప్రారంభించింది. నెలవారీ ఆదాయం రూ.1500, అంతకంటే తక్కువున్న వారు నెలకు రూ.25 చెల్లిస్తే నిత్యం 100 కిలోమీటర్ల మేర ఉచితంగా ప్రయాణించే అవాకాశాన్ని కల్పించింది. అర్హత ధ్రువీకరణ బాధ్యతను ఎంపీలు, ఎమ్మెల్యేలకు కట్టబెట్టారు. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అర్హులను పక్కనపెట్టి కార్యకర్తలకు, అనుచరులకు పాసులు దక్కేలా చేయటంతో పెద్దఎత్తున ఫిర్యాదులందాయి. దీంతో 2013లో రైల్వే శాఖ దీనిపై విచారణ జరిపింది. ఒక్క దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే దాదాపు ఏడు లక్షల పాసులు అనర్హుల చేతుల్లోకి వెళ్లినట్టు తేలింది. ఈ పాసుల వల్ల సాలీనా దాదాపు రూ.500 కోట్లకు పైగా నష్టపోతున్నట్టు రైల్వే శాఖ నిర్ధారించుకుంది. అది అమలైన సమయంలో అనర్హులే ఎక్కువగా లబ్ధిపొందినందున అసలు పథకాన్నే ఎత్తేయటం మంచిదని నిర్ణయించింది.
నష్టపోతున్న నిరుపేదలు..
వివిధ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు నగరానికి వచ్చి ఇక్కడ హమాలీలుగానో, కూలీలుగానో పనిచేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. నగరంలో ఉంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయన్న ఉద్దేశంతో నిత్యం ఉదయం ఇక్కడకు వచ్చి రాత్రి తిరిగి సొంతూళ్లకు వెళ్తున్నారు. ఇలాంటి వారిలో రైలు వసతి ఉన్నవారు ఇజ్జత్ పాసులు పొందారు. ఇప్పుడా పథకం రద్దు కావటంతో ఎక్కువ మొత్తాన్ని చార్జీలుగా చెల్లించకతప్పటం లేదు.