ఆన్‌లైన్‌కు ‘ఆఫ్’ బ్రేక్!
ఆర్టీఏలో ఆన్‌లైన్ వ్యవస్థకు ఆటంకాలు
ఏజెంట్ల సేవలో తరిస్తున్న యంత్రాంగం
నేరుగా వచ్చే దరఖాస్తులకే ప్రాధాన్యం
ఆన్‌లైన్ దరఖాస్తులకు కొర్రీలు
వాహనదారుల్లో అవగాహనకు చర్యలు శూన్యం
వారం దాటినా ఆదరణకు నోచని వైనం
సిటీబ్యూరో: ఆర్టీఏలో ఆన్‌లైన్ సేవలకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయాన్ని అరిక ట్టేందుకు ప్రభుత్వం వారం రోజుల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సాంకేతిక పరిజ్ఞానం అమలుకు నోచుకోవడం లేదు. ఒకవైపు ఆఫ్‌లైన్‌లో ప్రత్యక్ష దరఖాస్తుల స్వీకరణ కొనసాగిస్తూనే మరోవైపు ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆహ్వానం పలకడం వల్ల ఈ పథకం లక్ష్యం నీరుగారుతోంది. ఇది ఇలా ఉంటే ఏజెంట్‌లు, మధ్యవర్తుల సేవల్లో తరించే ఆర్టీఏ యంత్రాంగం ఆన్‌లైన్ పౌరసేవలను విఫలం చేసేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డ్రైవింగ్ లెసైన్స్‌ల రెన్యూవల్స్, వాహనాల చిరునామా బదిలీలు, యాజమాన్య బదిలీ లు వంటి సేవల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనే వినియోగదారులను రకరకాల కొర్రీలు పెట్టి వెనక్కి పంపిస్తున్నారు. సరైన డాక్యుమెంట్‌లు లేవని, దరఖాస్తు నమూనా సరిగ్గా లేదని, చిరునామా ధృవీకరణ సరిగ్గా లేదనే కొర్రీలతో ఆన్‌లైన్ దరఖాస్తుదారులు తిరిగి ఏజెంట్‌లను ఆశ్రయించేవిధంగా నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. దీంతో ప్రతి రోజు వందల సంఖ్యలో పౌరసేవలను అందజేసే ఆర్టీఏ కార్యాలయాల్లో పట్టుమని పది ఆన్‌లైన్ దరఖాస్తులు కూడా రావడం లేదు.
ఎత్తుకు పై ఎత్తు...
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పది ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌లు, ఇతరత్రా మార్పులు, చేర్పుల కోసం వందల సంఖ్యలో అభ్యర్ధనలు దాఖలవుతాయి. రవాణాశాఖ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించిన 15 రకాల పౌరసేవల పైన ప్రతి రోజు కనీసం 1000 నుంచి 1200 మంది వినియోగదారులు ఉంటారు. నిజానికి వీరంతా ఈ సేవా కేంద్రాల్లో, ఇంటర్నెట్ కేంద్రాల్లో లేదా తమ ఇళ్ల నుంచి నేరుగా దరఖాస్తు చేసుకొనే సదుపాయం ఆన్‌లైన్ ద్వారా ఉంది. కానీ ఈ వారం రోజుల్లో అన్ని చోట్ల ఒకటి, రెండు దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. మిగతా వాళ్లంతా ఏజెంట్‌ల ద్వారానే సంప్రదిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా బలంగా వేళ్లూనుకొని వ్యవస్థీకృతంగా కొనసాగుతున్న ఏజెంట్‌ల కార్యకలాపాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ముందుకు తెచ్చినప్పుడుల్లా ఏదో ఒక రూపంలో దానికి ప్రతివ్యూహం అమలు జరిగి తీరుతూనే ఉంది. డ్రైవింగ్ లెసైన్సు పరీక్షల్లో పారదర్శక తను పెంచేందుకు, డ్రైవర్‌ల సామర్ధ్యాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు గతంలో ప్రవేశపెట్టిన ఆర్‌ఎఫ్‌ఐడీ సాంకేతిక వ్యవస్థ కూడా ఇలాగే విఫలమైంది. ఒక ఆర్టీఏ కార్యాలయంలో ఆర్‌ఎఫ్‌ఐడీకి చెందిన యాంటిన్నాలను సైతం విరగ్గొట్టేశారు. రహదారి భద్రత కోసం వాహనాల వేగాన్ని అంచనా వేసి నియంత్రించే స్పీడ్ రాడార్‌గన్ వ్యవస్థకు బ్రేకులు వేశారు. ప్రస్తుతం అదే పద్ధతిలో ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం విఫలమైనా ఆశ్చర్యపోవలసిన పనిలేదని ఆ శాఖ అధికారులే విస్మయం వ్యక్తం చేయడం గమనార్హం.
ఆఫ్‌లైన్ ఆగిపోతేనే ఆన్‌లైన్ సక్సెస్....
డ్రైవింగ్ లెసైన్సుకు సంబంధించి.... డ్రైవింగ్ లెసైన్స్ రె న్యూవల్, డూప్లికేట్ లెసైన్స్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లెసైన్స్, బ్యాడ్జ్ ,డ్రైవింగ్ లెసైన్స్‌లో చిరునామా మార్పు, లెసైన్సు రద్దు వంటి పౌరసేవల కోసం ఈ నెల 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.
అలాగే వాహనానికి సంబంధించిన అంశాలలో... హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్, వాహన యాజమాన్య బదిలీ, డూప్లికేట్ ఆర్.సి, ఆర్.సి.రెన్యూవల్, చిరునామా మార్పు, ఆల్టరేషన్ ఆఫ్ వెహికల్, ఎన్‌ఓసీ జారీ, నిరభ్యంత పత్రం రద్దు వంటి వాటి కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
కానీ ఆన్‌లైన్‌తో పాటు నేరుగా వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరించడం, ఆన్‌లైన్ దరఖాస్తులను నిరుత్సాహపర్చడం వల్ల ఇది విజయవంతం కావడం లేదు. ఇందుకు పరిష్కారంగా లెర్నింగ్ లెసైన్సులు, డ్రైవింగ్ లెసైన్సులకు స్లాట్ తరహాలో కేవలం ఆన్‌లైన్ మాత్రమే అందుబాటులో ఉంచి ఆఫ్‌లైన్ సేవలను నిలిపివేయాలి. లెర్నింగ్ లెసైన్సు, డ్రైవింగ్ లెసైన్సుల కోసం ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాల్లో నేరుగా సంప్రదించేందుకు అవకాశం లేదు. మొదట స్లాట్ న మోదు చేసుకున్న వారికే ఈ సేవలు లభ్యమవుతాయి. అదే తరహాలో మిగతా 15 సేవలను అమలు చేయడం మంచిది.