గద్వాలపై ఎందుకంత పంతం?
మాజీ మంత్రి డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన రాజకీయ అవసరాలకోసమా, ప్రజల సౌకర్యంకోసమా అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డి.కె.అరుణ ప్రశ్నించారు. అసెంబ్లీ ఆవరణలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. పంతంపట్టి గద్వాల జిల్లాను పక్కనబెట్టారని, గద్వాల ప్రజలపై సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకత, కసి ఎందుకని ప్రశ్నించారు. గద్వాల జిల్లాకు సంబంధించిన అభ్యంతరాలన్నీ ఒకే వ్యక్తి నుంచి వచ్చాయని సీఎం అనడం తగదని, ఒక వ్యక్తి 6 వేల విజ్ఞప్తులు ఆన్‌లైన్‌లో పంపించడం సాధ్యమా అని ప్రశ్నించారు. గద్వాల ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ప్రజాస్వామ్య విధానాన్ని వంచించేవిధంగా సీఎం స్థాయిలో కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు. జిల్లాల విభజన పారదర్శకంగా లేదని.. ఏ ఒక్క గ్రామంలోనైనా గ్రామసభలు నిర్వహించారా అని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను తీసుకుని జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తలసానికి అధికార గర్వం: మల్లు రవి
తలసాని అధికార గర్వంతో విర్రవీగుతూ ‘నాలుక చీరేస్తా’ అంటూ నోరు పారేసుకుం టున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అభ్యంతరాలు పట్టించుకోకుండా జిల్లాల ముసాయిదాలు అమలుచేసేందుకు కలెక్టర్లతో సీఎం సమీక్షలు చేయ డం తగదన్నారు. కొత్త జిల్లాలపై ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరారు.