మరో సెట్ పిటిషన్లపై జాప్యం చేయకండి | Do not delay another set petitions | Sakshi
Sakshi News home page

మరో సెట్ పిటిషన్లపై జాప్యం చేయకండి

Published Mon, Jul 4 2016 1:37 AM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM

మరో సెట్ పిటిషన్లపై జాప్యం చేయకండి - Sakshi

మరో సెట్ పిటిషన్లపై జాప్యం చేయకండి

- ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ను డిమాండ్ చేసిన బుగ్గన
- రెండోసారి ఇచ్చిన పిటిషన్లు సాంకేతికంగా సరైనవి
- అయినా సాంకేతిక లోపాలు కాదు సారాంశం చూడాలి
- శాసనసభ ఔన్నత్యాన్ని స్పీకర్ కాపాడాలి
 
 సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన 13 మంది ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదట సమర్పించిన పిటిషన్లను (ఫిర్యాదులను) సాంకేతిక కారణాలు చూపుతూ తిరస్కరించినట్లు ప్రకటించిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. సాంకేతిక పరంగా సరైన ఫార్మాట్‌లో ఇచ్చిన మరో సెట్ పిటిషన్లపై జాప్యం లేకుండా నిర్ణయం తీసుకోవాలని పీఏసీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెలపై స్పీకర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు.

అనర్హత పిటిషన్లలో సాంకేతిక లోపాలు కాదు.. సారాంశం చూడాలని చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రాజ్యాంగం, చట్టం ఏం చెబుతున్నాయనేదే పరిగణనలోకి తీసుకోవాలన్నారు. అనర్హత పిటిషన్లపై ఈనెల 8న విచారణ ఉన్నందునే స్పీకర్ హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని బుగ్గన విమర్శించారు. సంప్రదాయలను పరిరక్షిస్తూ ఏపీ శాసనసభ ఔన్నత్యాన్ని స్పీకర్ కాపాడాలని, పెండింగ్ పిటిషన్లపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తొలుత తాము 13 మంది ఎమ్మెల్యేలపై సమర్పించిన పిటిషన్లలో సాంకేతిక లోపాలున్నాయని తామే తెలుసుకున్నామని, ఆ వెంటనే మరో సెట్‌ను స్పీకర్‌కు ఇచ్చామని ఆయన వివరించారు.

ఈ ఏడాది మార్చి 5న అప్పటి తమ పార్టీ విప్ ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి టీడీపీలోకి ఫిరాయించిన ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్లను స్పీకర్‌కు ఇచ్చారని, ఆ తరువాత మార్చి 24న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై కూడా ఇలాంటి పిటిషన్లను అమర్‌నాథ్‌రెడ్డి అందజేశారన్నారు. వాటిల్లో సాంకేతిక లోపాలను గుర్తించిన తాము.. టీడీపీలోకి ఫిరాయించిన మరికొందరు ఎమ్మెల్యేలను కూడా అనర్హులను చేయాలని కోరుతూ ఏప్రిల్ 30న సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను అనుసరించి తమ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో మరో 16 పిటిషన్లను ఇచ్చామన్నారు. మరో పిటిషన్‌ను మే 13న చెవిరెడ్డి ఆధ్వర్యంలో అందజేశామన్నారు. జూన్ 9 తేదీల్లో మరో ఇద్దరిపై అనర్హత వేటు కోరుతూ తన ఆధ్వర్యంలో ఫిర్యాదులు ఇచ్చామన్నారు. తొలుత ఇచ్చిన పిటిషన్లను పక్కన బెడితే.. ఆ తరువాత సమర్పించిన పిటిషన్లు ఇప్పటికీ స్పీకర్ వద్దనే పెండింగ్‌లో ఉన్నాయని బుగ్గన అన్నారు.

 స్పీకర్ నిర్ణయం న్యాయస్థానాలకు అతీతం కాదు
 ఆర్టికల్ 112, 212 ప్రకారం స్పీకర్ తీసుకునే నిర్ణయంపై న్యాయస్థానాలు సమీక్షించడానికి వీలు లేదని చెబుతూ ఉంటారని, అయితే సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పీకర్ నిర్ణయాలు న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని తీర్పునిచ్చిందని రాజేంద్రనాథ్ గుర్తు చేశారు. సుధాకర్ అండ్ అదర్స్ వర్సెస్ జీవరాజ్ అండ్ అదర్స్ (కర్ణాటక) కేసులో సుధాకర్ అనే ఎమ్మెల్యే స్వతంత్య్ర ఎమ్మెల్యేగా శాసనసభలో కొనసాగుతూ ఒక రాజకీయ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ఆ క్లిప్పింగ్‌లను సాక్ష్యాలుగా స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే సుధాకర్‌ను అనర్హుడుగా ప్రకటించారు. ఈ కేసులో స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ వేరే రాజకీయ పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. ఇలాంటి పలు కేసులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

పదో షెడ్యూలులోని 6వ పేరాగ్రాఫ్‌ను అనుసరించి స్పీకర్ నిర్ణయం సభా నిర్ణయం కాదని,  దానికి సభామోదం ఉండదన్నారు. పదో షెడ్యూలులోని 48వ పేరాగ్రాఫ్ ప్రకారం స్పీకర్‌కు ఒక ఎమ్మెల్యేపై అనర్హత పిటిషన్ ఇచ్చాక తగిన నిర్ణయం తీసుకోకపోతే ఆ షెడ్యూలు స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పారు.ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకే ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారని గుర్తుచేశారు.ఈ చట్టం అమలులో ఉన్నా ఎవరికి వారు ఇష్టానుసారం పార్టీలు మారితే ఇక రాజ్యాంగం ఎందుకు? చట్టం ఎందుకు? అసలు ఎన్నికలే ఎందుకు?  అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement