ఎందుకంత భయం బాబూ? | Buggana rajendranath Fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

ఎందుకంత భయం బాబూ?

Published Sat, Jun 16 2018 3:12 AM | Last Updated on Fri, Aug 10 2018 8:42 PM

Buggana rajendranath Fires on CM Chandrababu - Sakshi

సాక్షి హైదరాబాద్‌: అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయానికీ భయపడుతున్నారు, అభద్రతాభావానికి, ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. వారి అవినీతి, అక్రమాలే వారిలో భయాన్ని మరింతగా పెంచేస్తున్నాయి.  బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి నేను కేవలం భోజనానికి వెళ్తేనే టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజంగానే కలిస్తే వారి ఆరోగ్యాలు ఏమైపోతాయో’’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. తాను, సత్యనారాయణ కలిసి ఢిల్లీలో రహస్యంగా బీజేపీ బాస్‌లను కలిసినట్లుగా మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బుగ్గన శుక్రవారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని టీడీపీ నేతలు రంగంలోకి దించి, తానేవో డాక్యుమెంట్లను అందజేశానని, అది ప్రివిలేజ్‌ కదా.. పీఏసీ రాజ్యాంగ బద్ధమైన కమిటీ కదా అని మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందని చంద్రబాబు ప్రభుత్వం ఇంతగా భయపడుతోందో అర్థం కావడం లేదన్నారు. బుగ్గన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘చంద్రబాబు మాదిరిగా అర్ధరాత్రి వెళ్లి చిదంబరంను, నితిన్‌ గడ్కరీని కలిసే ఖర్మ మా పార్టీ నేతలకు పట్టలేదు. మాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాకు తలెత్తుకొని జీవించడం నేర్పించారు. నేను పీఏసీ ఛైర్మన్‌గా ఏవైనా డాక్యుమెంట్లు ఇవ్వాల్సి వస్తే ఢిల్లీకి వెళ్లి అందజేయాలా? విజయవాడలో ఇవ్వలేనా? విశాఖలో ఇవ్వలేనా? పీఏసీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేడా? ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నాకు వ్యక్తిగతంగా స్నేహితుడైన ఆకుల సత్యనారాయణను కలిశా.

మేమిద్దరం కలిసి పక్కనే ఉన్న షాంగ్రిల్లా హోటల్‌కు మధ్యాహ్నం భోజనానికి వెళ్లాం. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ కాలేజీలో నా క్లాస్‌మెట్‌. ఏపీ భవన్‌లో నన్ను ఆయన ఆలింగనం చేసుకున్నారు. మరి ఆ ఫొటోను ఎందుకు బయటపెట్టడం లేదు? నేను బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి భోజనానికి వెళ్తేనే ఇంతగా ఉలిక్కిపడుతున్నారంటే.. నిజంగానే కలిస్తే టీడీపీ నేతల ఆరోగ్యాలు ఏమైపోతాయో! కూన రవికుమార్‌ నాతో మాట్లాడాడారు. అంటే ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లా? బీజేపీపై పోరాటం చేస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు టీటీడీ బోర్డులో మహారాష్ట్ర మంత్రి భార్యను సభ్యురాలిగా ఎందుకు నియమించారో చెప్పాలి. బీజేపీని పూర్తిగా సొంతం చేసుకున్నామని టీడీపీ భావిస్తోంది. అందుకే బీజేపీ నేతలతో ఎవరు మాట్లాడినా టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. 

లోకేశ్‌ ఫొటోల సంగతేంటి? 
మంత్రి నారా లోకేశ్‌ చేసిన ట్వీట్‌ చూస్తుంటే ఆకాశం విరిగి మీదపడుతుందని పరుగెత్తిన కుందేలు, జింక, గుంటనక్క కథ గుర్తుకొస్తోంది. ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకోవడం తప్పయితే.. లోకేశ్‌ విదేశాల్లో చేసిన విహారాలపై సోషల్‌ మీడియాలో చాలా ఫొటోలు వచ్చాయి, వాటి గురించి ఏం సమాధానం చెబుతారు? ఆయన ఎందుకింత అమాయకంగా ప్రవర్తిస్తున్నారు. అమెరికాలో లోకేశ్‌ చదువుకున్న యూనివర్సిటీపై సందేహం కలుగుతోంది. ఆకుల సత్యనారాయణ, నేను మెట్లపై కలిస్తేనే టీడీపీ అంతా కదులుతోంది.

ఇది టీడీపీ నేతల అమాయకత్వమా లేక విపరీతమైన భయమా? లోకేశ్‌ మైక్‌ ముందుకు వస్తే అర్థంపర్థం లేకుండా మాట్లాడుతారు. అందుకే ఆయనను ట్వీట్‌లకే పరిమితం చేశారనే అనుమానం కలుగుతోంది. కీలకమైన పంచాయతీరాజ్‌ శాఖను సీనియర్లను కాదని లోకేశ్‌కు అప్పగిస్తే ఆయన తన బాధ్యతలను పక్కనపెట్టి ఢిల్లీలో ఎవరు తిరుగుతున్నారు? ఏ హోటల్‌కు వెళ్తున్నారు? అని ట్వీట్లు చేయడం ఏమిటి? టీడీపీలో ఒక నాయకుడు ఇంకో నాయకుడితో కలవకూడదు, ఒక కులం ఇంకో కులంతో, ఒక మతం ఇంకో మతంతో కలవకూడదన్న విభజించి పాలించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒక మనిషి ఇంకో మనిషిని.. ఒక పార్టీ వాళ్లు ఇంకో పార్టీ వాళ్లను కలవకూడదా? ఇదేమైనా చట్టమా?

తెలుగుజాతి పరువు తీస్తున్నారు 
టీడీపీ అనైతిక రాజకీయాలు, జర్నలిజంలో కొందరు అనుసరిస్తున్న తీరు తెలుగు జాతి పరువు తీస్తున్నాయి. నేను ఢిల్లీకి వ్యక్తిగత పనుల మీదనే వెళ్లా. ఏపీ భవన్‌లో అన్ని పార్టీల ఎమ్మెల్యేలూ ఉంటారు. అక్కడ లాబీల్లో ఇద్దరు ఎమ్మెల్యేల మర్యాదపూర్వక సమావేశం చుట్టూ కథ అల్లడం టీడీపీ అభద్రతా భావానికి నిదర్శనం. చంద్రబాబు ఏం చేస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. ‘‘రాజ్యాంగం గురించి టీడీపీ నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనేయడం, అందులో నలుగురితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించడం రాజ్యాంగబద్ధమా? తప్పుంటే  తప్పు అని అంటాం, ఒప్పుంటే ఒప్పని అంటాం. టీడీపీ నేతల్లాగా అర్ధరాత్రి రాజకీయాలు చేయం. వాస్తవాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను చూసి టీడీపీ నేతలకు భయం పట్టుకుంది. రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ అవినీతికి చరమగీతం పాడడం ఖాయం’’ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తేల్చిచెప్పారు.

నీచ రాజకీయాలకు పరాకాష్ట
అధికార టీడీపీ నీతిమాలిన రాజకీయాలకు, ఆ పార్టీ అనుకూల మీడియా తప్పుడు ప్రచారానికి ఇది పరాకాష్ట. ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చెందిన వాహనాలను పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితోపాటు ఇతర ప్రభుత్వ అధికారులు కూడా వాడుకున్నారు. ఆ వాహనాల వివరాలను ఏపీ భవన్‌ లాగ్‌బుక్‌లో నమోదు చేశారు. అవి ఎప్పుడు, ఎక్కడెక్కడ తిరిగాయో అందులో పేర్కొన్నారు. ఇతర అధికారులు ఏ ప్రాంతాలకు వెళ్లారో రాశారు. బుగ్గన 14వ తేదీన సౌత్‌ ఎవెన్యూకు వెళ్లినట్లు నమోదు చేశారు. తర్వాత దాన్ని ట్యాంపరింగ్‌ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. సౌత్‌ ఎవెన్యూ ముందు ‘27’ అని దిద్దినట్లు కనిపిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసినట్లు స్పష్టమవుతోంది. ఇతర అధికారులు ఏ ప్రాంతాలకు వెళ్లారో రాశారు గానీ కచ్చితంగా ఫలానా కార్యాలయానికే వెళ్లారని పేర్కొనలేదు. బుగ్గన విషయంలో మాత్రం లాగ్‌బుక్‌ను ట్యాంపరింగ్‌ చేశారు. దీని ఆధారంగా... బుగ్గన ఫలానా చోట బీజేపీ నేతలతో సమావేశమయ్యారంటూ టీడీపీ నేతలు గగ్గోలు ప్రారంభించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement