
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతలతో రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమావేశమయ్యారని, ఆ సమావేశానికి బుగ్గనను తానే తీసుకెళ్లానని వచ్చిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం ఉదయం ఆయన ఇక్కడ ఏపీ భవన్ వద్ద మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘‘ఎవరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. ఢిల్లీలోని ఏపీ భవన్ ప్రభుత్వ అతిథి గృహం. ప్రజాప్రతినిధులు ఇక్కడ తారసపడడం, మాట్లాడుకోవడం సహజం.
అలాగే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఇక్కడ కలిశారు. ఇద్దరం కలిసి పక్కనే ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేశాం. ఇందులో రహస్యం ఏముంది? కానీ మీరు చిలువలు పలువలు చేసి.. అబద్ధాలు, అవాస్తవాల మీద బతుకుతున్నారు. బుగ్గనని అమిత్‌షా వద్దకు గానీ, రామ్‌మాధవ్ వద్దకు గానీ తీసుకెళ్లినట్టు నిరూపించండి. నేను సవాలు చేస్తున్నా. దేనికైనా సిద్ధంగా ఉన్నా. నా చాలెంజ్ స్వీకరిస్తారో లేదో చెప్పాలి.
అసత్యాలు ప్రచారం చేసిన ఏబీఎన్‌పై లీగల్ చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తాం. పబ్లిక్ అకౌంట్ కమిటీలో చైర్మనే కాదు.. సభ్యులు కూడా ఉంటారు. మా పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు దాంట్లో సభ్యుడు. కాగితాలు కావాలంటే ఆయన తెచ్చుకోలేరా? వాస్తవాలను పక్కదారి పట్టించి మీరు చేసే ప్రయత్నాలను ఖండిస్తున్నా. ఏపీ భవన్‌లో కలిస్తే రహస్యం ఏముందో లోకేశ్ నిరూపించాలి.’ అని సత్యానారాయణ అన్నారు.