ముసాయిదా నేడు విడుదల
{పజల ముందుకు కొత్త డివిజన్లు
సిద్ధమైన ముసాయిదా జాబితా
అభ్యంతరాలకు వారం గడువు
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రక్రియలో కీలకఅంకానికి బుధవారం తెర లేవనుంది. వార్డులు/డివిజన్ల పునర్విభజనకు సంబంధించిన ముసాయిదా జాబితాను నేడు విడుదల చేయనున్నారు. దీన్ని ప్రజల ముందుంచి... వారి అభ్యంతరాలు స్వీకరించేందుకు వారం రోజుల గడువునిస్తారు. డీలిమిటేషన్‌పై దాదాపు ఆరు నెలలుగా కసరత్తు సాగుతుండడం... ఈ నేపథ్యంలో వివిధ పరిణామాలు చోటు చేసుకోవడం తెలిసిందే. వార్డుల మధ్య సమతుల్యత కోసం 2011 జనాభా లెక్కల మేరకు సమాన జనాభా ఉండేలా డివిజన్లను రూపొందించాలనుకున్నారు. తొలుత 172 డివిజన్లు ఏర్పాటు కాగలవని భావించారు. అనంతరం 200 డివిజన్లకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ తరువాత సహజ సరిహద్దులు.. ఇతరత్రా ఇబ్బందుల దృష్ట్యా ఇది సాధ్యం కాదని కమిషనర్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో 150 డివిజన్లనే కొనసాగించాలని నిర్ణయించారు.
అన్ని డివిజన్లలో జనాభా దాదాపు సమానంగా ఉండేలా చూసేందుకు అధికారులు తిరిగి కసరత్తు చేపట్టారు. 150 సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. కొన్ని సర్కిళ్లలో డివిజన్లు పెరగనున్నాయి. కొన్ని సర్కిళ్లలో తగ్గనున్నాయి. ముసాయిదా జాబితాను బుధవారం విడుదల చేయనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. సంఖ్యలో మార్పు లేనప్పటికీ.. జనాభాకు అనుగుణంగా కొత్త డివిజన్లు ఉంటాయన్నారు. ప్రజలు, రాజకీయ పక్షాలు, వివిధ వర్గాల నుంచి అందే విజ్ఞప్తులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని అవసరమైతే ముసాయిదాలో మార్పుచేర్పులు చేస్తామని చెప్పారు. కొత్తగా వచ్చే డివిజన్లలో చిలుకానగర్, భారతీనగర్, అల్లాపూర్ వంటివి ఉన్నాయి. ఒక్కో డివిజన్‌కు సగటున 40 వేల నుంచి 47 వేల జనాభా ఉండే అవకాశం ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగా ఏర్పాటు కానున్న డివిజన్లు సర్కిళ్ల వారీగా ఇలా ఉన్నాయి. వీటిలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది.