
నమ్మకంగా ఆడీ కారు కొట్టుకెళ్లాడు...
బంజారాహిల్స్: నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికే టోకరా వేసి రూ.50 లక్షల విలువైన కారును దొంగిలించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రస్సెల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ సంస్థ ఎండీ రస్సెల్ జహీర్ మూడు నెలల క్రితం ఆడీ క్యూ-5 కారును కొనుగోలు చేశాడు.
నెల రోజుల క్రితం ఈ వాహనానికి డ్రైవర్గా సయ్యద్‌నగర్ చిల్లా ప్రాంతానికి చెందిన నజీర్(25)ను పెట్టుకున్నాడు. ఎంతో నమ్మకంగా పని చేస్తున్న నజీర్‌కు ప్రతిరోజు కారు తాళాన్ని అప్పగించేవాడు. అలానే గురువారం సాయంత్రం కారు తీసుకొని బయటకు వెళ్లిన నజీర్ తిరిగి రాలేదు. దీంతో అతనికి ఫోన్ చేయగా, అది నాట్ రీచబుల్ అని వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన రస్సెల్ జహీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.