సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యం
అల్వాల్: డబ్బులు సంపాదించాలనే దురాశతో ఇద్దరు యువకులు ఏకంగా ఖరీదైన శునకాన్నే దొంగిలించారు. దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయని భావించి వారు ఈ దుశ్చర్యకు పాల్పడగా... సీసీ కెమెరాలో చిక్కడంతో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మచ్చ బొల్లారంలో నివసించే అంబిక అనే మహిళ ఇంట్లో హైబ్రిడ్ శునకాన్ని(స్మార్టీ) పెంచుకుంటోంది. నెల రోజుల క్రితం స్థానికంగా నివసించే పవన్, శరత్‌చంద్రలు ఆ శునకాన్ని దొంగిలించారు. దాన్ని మరో కుక్కతో క్రాసింగ్ చేయించారు. స్మార్టీకి పుట్టిన పిల్లల్ని, తల్లిని అమ్మి సొమ్ము చేసుకుందామని భావించారు. అయితే తమ స్మార్టీ కన్పించకపోవడంతో యజమానురాలు అంబిక అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు.
అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. కుక్కే కదా ఏమవుతుంది అనుకున్న యువకులు చివరకు కటకటాలపాలయ్యారు. ఇదిలా ఉండగా తన స్మార్టీకి క్రాసింగ్ చేయడం కూడా నేరమని పోలీసులతో అంబిక వాగ్వివాదానికి దిగింది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాన్ని నిందితులు అనారోగ్యానికి గురయ్యేలా చేశారని, దీనికి పూర్తి బాధ్యత వారిదేనని ఆరోపించింది. పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శునకాన్ని యజమానురాలికి అప్పగించారు.
(పోలీస్ స్టేషన్ వద్ద కుక్క కోసం పంచాయితీ)
Comments
Please login to add a commentAdd a comment