న్యాయ శాఖ అభ్యంతరం...
సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీపై ఇప్పటికీ మల్లగుల్లాలు కొనసాగు తున్నాయి. పాత జిల్లాల పరిధిని పరిగణనలోకి తీసుకోవాలా.. కొత్త జిల్లాలతో డీఎస్సీ నిర్వహించాలా.. అనే విషయమై నెలకొన్న సందిగ్ధం ఇప్పటికీ వీడలేదు. కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పరిగణించిందని, వాటి ఆధారంగానే జిల్లా స్థాయిలోని పోస్టులు భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు.
కానీ కొత్త జిల్లా యూనిట్‌గా డీఎస్సీ నిర్వహిస్తే సమస్యలొస్తాయని, న్యాయపర చిక్కులు తప్పవని న్యాయ శాఖ అభిప్రాయపడుతోంది. ఉద్యోగాల భర్తీకి కొత్త జిల్లాలు చిక్కుముడిగా మారాయని అంగీకరిస్తున్న అధికారులు.. సీఎం సూచనల నేపథ్యంలో అటో ఇటో చెప్పేందుకు వెనుకాడుతున్నారు. ప్రధానంగా జిల్లా స్థాయి పోస్టుల భర్తీ ఇరకాటంలో పడిందని, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా న్యాయపర చిక్కులు తప్పవని వారి వాదన.
టీచర్ పోస్టుల భర్తీకి ఏ నిబంధనలు పాటించాలి? డీఈవోల పరిధిలో నిర్వహించాల్సి వస్తే కొత్త జిల్లాల ను యూనిట్‌గా ఎంచుకోవాలి.. పాత జిల్లాలను ఎంచుకుంటే ఏ కారణాలు చెప్పుకోవాలి.. పాత జిల్లాల పరిధిని ఎందుకు ఎంచుకున్నారని న్యాయపరంగా చిక్కులొస్తే వివరణలు ఇచ్చుకోవాలి. ఈ సందేహాలు ఒకదానికొకటి ముడిపడి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ, టీఎస్‌పీఎస్‌సీ మౌనం వహిస్తున్నాయి.
ఆగస్టు 15న లక్షకు మించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించిన సీఎం.. మరుసటి రోజే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ చక్రపాణి, సీఎస్ ఎస్‌పీ సింగ్‌తో ఆకస్మిక సమీక్ష నిర్వహించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. కడియం నేతృత్వంలో ఆగస్టు 16న ఈ తొలి భేటీ జరిగింది. 21న మరోసారి జరగాల్సిన సమావేశం ఇప్పటికీ నిర్వహించలేదు. దీంతో ఇప్పటికే గుర్తించిన 8,792 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందనేది.. అటు విద్యా శాఖ, ఇటు టీఎస్‌పీఎస్‌సీ చెప్పలేకపోతున్నాయి.
కొత్త జిల్లాలతో డీఎస్సీకి సీఎం మొగ్గు!
Published Sat, Sep 2 2017 3:07 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM
Advertisement