పార్ధీలు.. తల్లిచాటు బిడ్డలు.. | During the Nizam of immigration | Sakshi
Sakshi News home page

పార్ధీలు.. తల్లిచాటు బిడ్డలు..

Published Wed, Jan 20 2016 12:51 AM | Last Updated on Sun, Sep 3 2017 3:55 PM

పార్ధీలు.. తల్లిచాటు బిడ్డలు..

పార్ధీలు.. తల్లిచాటు బిడ్డలు..

చార్మినార్: భాగ్యనగరం ఎందరో వలస జీవులకు పుట్టిల్లు. భారతదేశంలోని అన్ని జాతులను, భిన్న సంప్రదాయాలను తనలో ఇముడ్చుకున్న మహా సంగమం. సిటీలో ఏ మూలకు వెళ్లినా కొంగొత్త పరిమళాలు సుతారంగా తాకుతునే ఉంటాయి. వందల ఏళ్ల కాలగమనంలో.. హైదరాబాద్ నగర జీవనంలో పార్ధీలు తమ ప్రత్యేకతను చాటుతునే ఉన్నారు. పితృస్వామిక సమాజంలో మాతృ ప్రాధాన్యం గల కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు.
  
నిజాం కాలంలో వలస
రాజస్థాన్ ప్రాంతానికి చెందిన కొండజాతి ప్రజలను పార్ధీలనేవారు. అప్పట్లో వీరు కొండలు, గుట్టల్లో ఉంటూ వేట జీవనాధారంగా సంచార జీవనం సాగించేవారు. పిట్టల వేట వీరి ప్రధాన వృత్తిగా ఉండేది. జనసామాన్యంలో పిట్టలోళ్లుగా స్థిరపడ్డారు. మహిళలను ప్రత్యేకంగా పార్ధన్ అని పిలుస్తారు. చిత్తోడ్‌ఘర్ నుంచి వలసవచ్చిన మీరాబాయిపై గోల్కొండ నవాబు మనసు పారేసుకున్నాడట. ఆమెకు నవాబు 17 గ్రామాల్ని బహుమతిగా ఇచ్చినట్టు పార్ధీల కథనం. 400 ఏళ్ల క్రితమే నగరానికి వలస వచ్చిన వీరు ఇప్పటికీ తమ సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ వస్తున్నారు.

సిటీలో ప్రత్యేక బస్తీలు..
తొలినాళ్లలో పిట్టల వేట ప్రధాన వృత్తిగా ఉండేది. ప్రస్తుతం పళ్లు, కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నారు. పార్ధీలకు ప్రత్యేక భాష ఉన్నా.. లిపి లేదు. వీరి కుటుంబాల్లో స్త్రీలదే ముఖ్య భూమిక. పూర్తిగా మాతృస్వామిక వ్యవస్థ. వ్యాపారాలు వారి కనుసన్నల్లోనే జరుగుతుంటాయి. భార్యలు చెప్పినట్టు భర్తలు నడుచుకోవాల్సిందే. ప్రస్తుతం నగరంలో పార్ధీలు సుమారు 2.5 లక్షల మంది ఉన్నారు. కానీ వీరి సంక్షేమానికి ఎలాంటి అసోసియేషన్లు లేవు. బస్తీల వారీగా పంచాయతీ కమిటీలే కీలక నిర్ణయాలు చేస్తాయి.
  
హోలీ సంబరాలు స్పెషల్..
వీరు వినాయక చవితి, హోలీ పండగల్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కుటుంబంలోని అంద రూ డాన్సులు చేస్తూ వినాయక నిమజ్జనానికి తరలివస్తారు. హోలీని మూడు రోజులు జరుపుకుంటారు. దేశ వ్యాప్తంగా ఉన్న పార్ధీలంతా శివారులోని జల్‌పల్లిలో గుడారాలు వేసుకుని హోలీని అట్టహాసంగా చేస్తారు.
  
వీరికి ప్రత్యేక బస్తీలు..

నగరంలో పార్ధీలకు ప్రత్యేక బస్తీలు ఉన్నాయి. పురానాపూల్, ఎస్.వి.నగర్, లక్ష్మీనగర్, విష్ణునగర్, జాలీ హనుమాన్, లాల్‌దర్వాజా, రాజన్నబౌలి, ఎల్‌బీనగర్, చిక్కడపల్లి, మురళీధర్ బాగ్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, ఫతేనగర్, ఎర్రగడ్డ, సీతాఫల్‌మండి, చిలకలగూడ, బాలానగర్, కాచిగూడ చౌరస్తా, ఉప్పర్‌గూడ, రాణిగంజ్  ప్రాంతాల్లో పార్ధీవాడలు ఉన్నాయి.
  
రాజకీయ నిర్ణేతలుగా..

నగరంలో వందల ఏళ్ల క్రితం స్థిరపడిన పార్ధీలు ఇక్కడి రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. పురానాపూల్ డివిజన్ నుంచి ఎన్నికైన కాశీరాం 1968-69లో డిప్యూటీ మేయర్‌గా కొనసాగారు. పార్ధీల తరఫున ఎన్నికైన మొదటి ప్రజాప్రతినిధి ఆయనే. 1986 ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పురానాపూల్ డివిజన్ నుంచి ఎస్. విజయకుమారి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కొన్ని డివిజన్లలో అభ్యర్థుల భవితవ్యం వీరు తేల్చనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement