తెలంగాణ నుంచి 20 వేలు, ఏపీ నుంచి 10 వేలు
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎంసెట్-2కు ఇప్పటివరకు 30,787 దరఖాస్తులు వచ్చాయి. నీట్ ద్వారా నింపే సీట్లు పోనూ మిగిలిన 1,725 సీట్లను ఈ ఎంసెట్-2తో భర్తీ చేస్తారు. జూలై 7న నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే వారి నుంచి ఈనెల 1 నుంచి ఎంసెట్ కమిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది. విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీతో ఆన్‌లైన్‌లో దరఖాస్తుల గడువు ముగియనుంది. అధిక సంఖ్యలో దరఖాస్తులు వస్తాయని అధికారులు భావించినా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
ఇక ఆలస్య రుసుముతో మాత్రం పరీక్షకు ఒక రోజు ముందు వరకు దరఖాస్తు చేసుకునే వీలు ఉంది. ఎంసెట్-1కు మాత్రం లక్ష మందికిపైగా విద్యార్థులు అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ ఎంసెట్ ద్వారా అగ్రికల్చర్, వెటర్నరీ తదితర 12 రకాల కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉండటంతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం జూన్ 7న నిర్వహించబోయే ఎంసెట్-2 ద్వారా కేవలం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోనే ప్రవేశాలు చేపట్టనున్న నేపథ్యంలో దరఖాస్తులు తగ్గాయని అధికారులు పేర్కొన్నారు. ఇక విద్యార్థులు జూలై 2 నుంచి 7వరకు ఎంసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవ చ్చు.
ఇదీ ఎంసెట్-2 షెడ్యూల్...
7-6-2016: ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ
14-6-2016: రూ. 500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ
21-6-2016: రూ. 1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ
28-6-2016: రూ. 5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ
6-7-2016: రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ
2-7-2016 నుంచి 7-7-2016 వరకు: వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్
9-7-2016: రాత పరీక్ష (ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు)
ఎంసెట్-2కు 30,787 దరఖాస్తులే!
Published Mon, Jun 6 2016 3:19 AM | Last Updated on Tue, Oct 16 2018 2:57 PM
Advertisement
Advertisement