నగరంలో ఎంసెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పది రోజుల్లో 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటి వరకు 28 వేల దరఖాస్తులు
నివాసానికి 5 కి. మీ పరిధిలో పరీక్ష కేంద్రాలు
సిటీబ్యూరో: నగరంలో ఎంసెట్‌కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం పది రోజుల్లో 25 వేలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 41 వేల దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా తెలంగాణ ఎంసెట్ కార్యాలయానికి అందగా, ఇందులో సింహభాగం నగరం నుంచే ఉండడం విశేషం. గతనెల 28న ఎంసెట్ నోటిఫికేషన్ వెలువడగా ఇప్పటివరకు ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌లో కలిపి మొత్తం 28 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంజినీరింగ్‌తో పోల్చుకుంటే మెడిసిన్ విభాగంలో అధిక సంఖ్యలో పోటీపడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇంజినీరింగ్ కోసం 13 వేలకుపైగా, అగ్రికల్చర్-మెడిసిన్‌కు 14 వేలకు పైగా దరఖాస్తులు అందగా. మరో 164 మంది రెండు విభాగాలకూ దరఖాస్తు చేసుకున్నారు.
గతేడాది నగరం నుంచి రెండు విభాగాలకు గాను దాదాపు 1.14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజినీరింగ్‌కు 45 వేలు, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 67కు పైగా దరఖాస్తులు అందాయి. ఈ సారి అంతకుమించి దరఖాస్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 27 వేలు దాటడం, ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 28వ తేదీ ఆఖరు.
5 కి.మీ పరిధిలోనే సెంటర్..
అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగరాన్ని మొత్తం 8 జోన్లుగా విభజించి.. వాటి పరిధిలోని ప్రాంతాలను కేటాయించారు. నగరంలో రహదారులు రద్దీగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు పరీక్ష కేంద్రాల ఎంపికపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నివాస ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలో పరీక్ష కేంద్రం వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ చర్యల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యల నుంచి అభ్యర్థులకు ఉపశమనం లభించనుంది.