మద్యంపై ఉన్న ధ్యాస.. విద్యపై లేదు
ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలం
ఇదే తీరు కొనసాగితే మరో ఉద్యమమే
అధిక ఫీజు వసూళ్లపై హెచ్‌ఎస్‌పీఏ మండిపాటు
శ్రీనగర్‌కాలనీ: పైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ఇన్వెస్టిగేషన్ కమిటీ వేసి విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు విక్రాంత్, ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, ఆశిష్‌లు మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఏడేళ్లుగా 225 శాతం ఫీజులు పెరిగాయని చెప్పారు. పాఠశాల యాజమన్యాలు ఇష్టారీతిన ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థికభారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ఫీజుల వసూళ్లపై మంత్రి కడియం శ్రీహరికి, అధికారులకు నివేదికలు ఇచ్చినా చర్యలు శూన్యమని ఆరోపించారు. మద్యంపై ఉన్న ధ్యాస విద్యావ్యవస్థపై ఉంటే... మూడు రోజుల్లో సమగ్ర చట్టాలను రూపొందించవ్చని అభిప్రాయపడ్డారు.
మద్యం విధివిధానాలపై చర్చలు, సమావేశాలు జరుపుతున్న ప్రభుత్వం.. విద్యా చట్టాల విధానాల్ని మార్చలేక పోతోందని మండిపడ్డారు. తమిళనాడు, మహారాష్ట్ర తరహా విద్యా చట్టాన్ని రూపొందించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ఫీజుల నియంత్రణ చేపట్టకపోతే మరో ఉద్యమానికి తెరలేపుతామని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. తల్లిదండ్రులు కూడా ప్రతి పాఠశాలలో అసోసియేషన్‌గా ఏర్పడి ఫీజుల నియంత్రణపై పోరాడాలని పిలుపు నిచ్చారు.
ఆ చిత్తశుద్ధి ఏది..?
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జీఓ నెంబర్ 91ని సమగ్రంగా అమలు చేస్తూ చిత్తశుద్ధితో ఫీజుల నియంత్రణ చేపట్టారని ప్రశంసించారు. ఆయన మరణానంతరం జీఓను తుంగలో తొక్కారని, మూడేళ్లలో కోల్పోయిన ఫీజులను ముక్కుపిండి వసూలు చేశారని ధ్వజమెత్తారు. దీంతో ప్రస్తుతం చదువు కొనుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు ఏటా ఐదు శాతానికి మించి ఫీజులు పెంచకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా... 20, 30 శాతం పెంచేశారని మండిపడ్డారు. ఫలితంగా తల్లిదండ్రులు వ్యక్తిగత రుణాలు తీసుకుని పిల్లల ఫీజులు చెల్లించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రవి, కమల్, సాయిరాజ్ పాల్గొన్నారు.
చట్టబద్ధత అవసరం
విద్యావ్యవస్థలో చట్టబద్దత అవసరం. నేటి విద్యావ్యస్థ వ్యాపారంగా తయారైంది. వేలు, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై తీవ్ర భారాన్ని మోపుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టం తీసుకువచ్చి ఏడేళ్లు అవుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రభుత్వాలు భాద్యత వహించి విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. - విక్రాంత్, హెచ్‌ఎస్‌పీఏ అధ్యక్షుడు
ప్రభుత్వాలు మారినా ఫలితం లేదు...
ప్రభుత్వాలు మారినా విద్యావ్యస్థలో ఎలాంటి మార్పులు రావడం లేదు. ఇష్టం వచ్చినట్లు ఫీజులు దండుకుంటున్నారు. వైఎస్సార్ హయాంలో జీఓ 91 సమగ్రంగా అమలు పరిచి ఫీజుల నియంత్రణను చేపట్టారు. రాజకీయం రంగులు మారుతుందే తప్ప విద్యావ్యస్థ, విధానాల్లో మార్పులు రావడం లేదు.
- సుబ్రహ్మణ్యం, హెచ్‌ఎస్‌పీఏ సభ్యులు