విద్యుత్ చార్జీల బాంబు!
1,100 కోట్ల రూపాయలు
ఏప్రిల్ నుంచి విద్యుత్తు బాదుడుకు కేబినెట్ సూత్రప్రాయ అంగీకారం?
941 కోట్ల రూపాయలు
2015-16లో బాబు సర్కారు పెంచిన కరెంటు చార్జీలు
సాక్షి, హైదరాబాద్: మరోసారి కరెంటు చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెరగడం ఇది రెండోసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.941 కోట్ల మేరకు విద్యుత్ చార్జీలు పెంచిన బాబు సర్కారు.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మరో రూ.1,100 కోట్లకు పైగా ప్రజలపై అదనపు భారం వేయనుంది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం. బాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మొత్తం రూ.2 వేల కోట్లకు పైగా భారం మోపుతూ నిర్ణయం తీసుకున్నారన్నమాట.
2016-17 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ చార్జీల రూపంలో ప్రజల నుంచి మొత్తం రూ. 22 వేల కోట్లు వసూలు చేయాలని పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.17,700 కోట్ల ఆదాయాన్ని డిస్కమ్‌లు అంచనా వేశాయి. ఉచిత విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వం రూ.3,188 కోట్లు ఇచ్చింది. వచ్చే ఏడాది కూడా ప్రభుత్వం ఇదే మొత్తం సబ్సిడీగా ఇచ్చే పక్షంలో రూ.1,100 కోట్లకు పైగా అదనపు ఆదాయం అవసరమవుతుందని డిస్కమ్‌లు తమ వార్షిక ఆదాయ, అవసర నివేదికల్లో పేర్కొన్నాయి. ఈ మొత్తాన్ని ప్రభుత్వమైనా ఇవ్వాలని లేదా చార్జీల పెంపుద్వారా రాబట్టుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరాయి. అయితే ప్రజలపై భారం వేసేందుకే ప్రభుత్వం మొగ్గుచూపినట్లు సమాచారం.
వాస్తవానికి అధిక ధర వెచ్చించి ఎడాపెడా ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు చేస్తున్న ప్రభుత్వం.. అందుకవుతున్న వ్యయాన్ని కూడా తానే భరించాల్సి ఉండగా.. ఎప్పటికప్పుడు విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజల నుంచి వసూలు చేస్తోంది. ఇప్పుడు కూడా రూ.1,100 కోట్లకు పైగా చార్జీల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సమాచారం. మరోవైపు ఉచిత విద్యుత్ కూడా కత్తెర వేసే యోచనలో ప్రభుత్వం ఉందని, ఆ మేరకు సబ్సిడీ కూడా తగ్గిస్తే ప్రజలపై మరింత భారం (రూ.1,100 కోట్లకు అదనంగా) పడే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఇలావుండగా అవసరాన్ని బట్టి శ్లాబుల్లో మార్పునకూ రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళను వచ్చే ఏడాది కూడా యథాతథంగా కొనసాగించాలని తీర్మానించింది. భవిష్యత్‌లోనూ విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతుందనే అశాస్త్రీయమైన లెక్కలు కడుతూ వచ్చే ఏడాది సైతం ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించాలని నిర్ణయించింది.
నేడు ఏఆర్‌ఆర్‌లు మాత్రమే!
విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి గురువారం 2016-17 వార్షిక ఆదాయ, అవసర నివేదికలు మాత్రమే సమర్పించాలని విద్యుత్ పంపిణీ సంస్థలు నిర్ణయించుకున్నాయి. ఏఆర్‌ఆర్‌లలో కేవలం రాబోయే సంవత్సరానికి విద్యుత్ డిమాండ్ ఎంత? ఎంత మొత్తంలో రాబడి ఉండాలనే అంశాలనే పేర్కొంటారు. శ్లాబ్‌ల వారీ వివరాలతో చార్జీల (టారిఫ్) ప్రతిపాదనలను ఆ తర్వాత ఇచ్చే వీలుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. కొత్త విద్యుత్ చార్జీలకు ఈఆర్‌సీ ఆమోదం లభిస్తే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
ఉచితానికి 3 వేల ఎంయూల కోత!
రాష్ట్రంలో ఏటా 54 వేల మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఇందులో 11,700 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి సరఫరా అవుతోంది. 2015-16లో వరుసగా తుపాన్లు రావడం, ఖరీఫ్, రబీ సాగు తగ్గడంతో వ్యవసాయ విద్యుత్ డిమాండ్ 3 వేల మిలియన్ యూనిట్ల వరకు తగ్గింది. ప్రభుత్వం ఇప్పుడు దీన్నే కొలమానంగా తీసుకునే ఆలోచనలో ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3 వేల మిలియన్ యూనిట్ల మేరకు వ్యవసాయ విద్యుత్‌కు కత్తెరేయాలని భావి స్తోంది. వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్‌ను తక్కువగా చూపించి, ప్రభుత్వం సబ్సిడీని తగ్గిస్తుందా? అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.
సబ్సిడీని తగ్గిస్తే ఆ మేరకు విద్యుత్ చార్జీల్లో పెంపుదల (రూ.1,100 కోట్లకు అదనంగా) చోటు చేసుకుంటుందన్నమాట. ఒకవేళ డిమాండ్ పెరిగితే ఉచిత విద్యుత్ సరఫరాను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక 50 నుంచి 100 యూనిట్ల వరకూ ఉన్న శ్లాబ్ రేట్‌ను తగ్గించే యోచనపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగినట్టు తెలిసింది.